ముఖ్యమంత్రి జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వ నాశనమైందని టీడీపీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రాజెక్టులపై నీలి నీడలు కమ్ముకున్నాయన్నారు. రంకలేస్తే పోలవరం పూర్తికాదనే విషయాన్ని మంత్రి అంబటి రాంబాబు గ్రహించాలని విమర్శించారు. అవగాహన లేని వ్యక్తి జలవనరుల శాఖ మంత్రిగా ఉండటం రాష్ట్ర దౌర్భాగ్యమని అన్నారు.
సీఎం జగన్ అవగాహన రాహిత్యం, అజ్ఞానం వల్ల ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయని గోరంట్ల విమర్శించారు. పోలవరం పనులు ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. వాస్తవాలు బయటపడకుండా ఉండేందుకే పోలవరం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో నిధులు ఎందుకు సాధించలేకపోతున్నారని నిలదీశారు. గత పథకాలకే పేర్లు మార్చి సంక్షేమానికి ఖర్చు చేస్తున్నామని అంటున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ రాష్ట్రంలోని పరిస్థితుల గురించి కనీసం ఆలోచించడం లేదని, కేవలం ఓట్ల కోసం మాత్రమే ఆలోచిస్తున్నారన్నారు. ప్రాజెక్టుల పట్ల తన నిర్లక్ష్య వైఖరికీ జగన్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని గోరంట్ల డిమాండ్ చేశారు.