అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో మాత్రం టీడీపీ విజయాన్ని అందుకుంది. 24వ వార్డు నుంచి బరిలోకి దిగిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఆయన వైఎస్సార్‌సీపీ అభ్యర్థిపై ఏకంగా 304 ఓట్ల భారీ మెజార్టీ దక్కించుకున్నారు. తాడిపత్రిలో మొత్తం 36 వార్డులు ఉండగా.. టీడీపీ అత్యధికంగా 18 వార్డుల్లో గెలుపొంది మున్సిపాలిటీపై పచ్చ జెండాను ఎగురవేసింది. ఇదే సమయంలో వైసీపీ 16 స్థానాలను కైవసం చేసుకోగా.. ఇతరులు 2 స్థానాలను గెలుచుకున్నారని అంటున్నారు. తాడిపత్రి మున్సిపాలిటీలోని టీడీపీ కౌన్సిలర్లను ఆ పార్టీ నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డి, పవన్ రెడ్డిలు రహస్య ప్రదేశానికి తరలించారు. జిల్లాలో తాడిపత్రి మున్సిపాలిటీని టీడీపీ గెలుచుకుంది. దీంతో తమ అభ్యర్థులను వైసీపీ నాయకులు ప్రలోభ పెడతారని భావించి వారిని ఎవరికీ తెలియని ప్రదేశానికి జేసీ సోదరులు తరలించారు. 20 మంది టీడీపీ కౌన్సిలర్లను తీసుకుని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ పవన్ రెడ్డి హైదరాబాద్‌కు బయలుదేరారని అంటున్నారు

టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల కోసం అందరినీ కలుపుకుని పోతానని అన్నారు. తాడిపత్రిపై ప్రేమతోనే వాళ్లు తమను గెలిపించుకున్నారని.. ప్రజలకు తానే ధైర్యమని.. తనను చూసే గెలిపించారన్నారు. జేసీని నమ్మారన్నారు.ఈ గెలుపు తాడిపత్రి ప్రజలకు అంకితమిస్తున్నట్టు తెలిపారు. పదిరోజుల తర్వాత మున్సిపల్ ఆఫీసులో కూర్చుని ప్రజలకు అన్నీ చెబుతానని, ఏముంది.. ఏం చేయగలమో అన్నీ చెబుతా అన్నారు. ప్రతి విషయంలో అందరినీ కలుపుకుపోతానని, ఎమ్మెల్యేను సైతం కలుపుకుని పోతామన్నారు. తనకు ఏదీ అవసరం లేదని, 365 రోజులు.. 24 గంటలు ప్రజల కోసం పని చేస్తానన్నారు. తాడిపత్రి ప్రజల కోసం ఎంత తగ్గాలో అంత తగ్గి పని చేస్తానని అన్నారు.


తోట‌ వంశీ కుమార్‌

Next Story