రాయ‌ల‌సీమ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన సోమువీర్రాజు

Somu Veerraju Apology to Rayalaseema people.భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు రాయ‌ల‌సీమ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Jan 2022 4:56 AM GMT
రాయ‌ల‌సీమ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన సోమువీర్రాజు

భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు రాయ‌ల‌సీమ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. ప్ర‌భుత్వ తీరును విమ‌ర్శించే క్ర‌మంలో తాను వాడిన ప‌దాలు రాయ‌ల‌సీమ ప్ర‌జ‌ల మ‌న‌సుల‌ను గాయ‌ప‌రిచాయ‌ని.. త‌న వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకుంటున్నాన‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించారు.

'రాయలసీమ రతనాల సీమ అనే ఈ పదం నాహృదయం లో పదిలం. రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును విమర్శించే విషయంలో వాడిన పదాల వల్ల రాయలసీమ ప్రజలు మనసులు గాయపడ్డాయి. ఈ పదాలను వాపసు తీసుకుంటున్నాను. ఈ విషయంలో క్షమాపణలు చెబుతున్నాను. నేను నిరంతరం రాయలసీమ అభివృద్ధి విషయంలో అనేక వేదికలపై ప్రస్తావిస్తూ వస్తున్న విషయం ఆ ప్రాంత వాసులకు తెలుసు, రాయలసీమకు నికర జలాలు, పెండింగ్ ప్రాజెక్టుల విషయాలను అనేక సందర్భాల్లో ప్రస్తావించాను. రాయలసీమ అభివృద్ధి ఇంకా వేగవంతం కావాలని భారతీయ జనతా పార్టీ ఆలోచన' అని సోము వీర్రాజు ట్వీట్ చేశారు.

గురువారం విశాఖ‌ప‌ట్నంలో ప‌ర్య‌టించిన సోము వీర్రాజు మాట్లాడుతూ.. 'రాయ‌ల‌సీమ‌లో ఎయిర్‌పోర్టు.. క‌డ‌ప‌లో ఎయిర్‌పోర్ట్‌.. ప్రాణాలు తీసేసే వారి జిల్లాలో కూడా ఎయిర్‌పోర్టులా' అంటూ వ్యాఖ్యానించారు. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై తీవ్ర దుమారం రేగింది. రాయ‌ల‌సీమ నేత‌లు స‌హా వామ‌ప‌క్ష రాష్ట్ర నేత‌లు తీవ్రంగా మండిప‌డ్డారు. సోము వీర్రాజు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే వివాదానికి ముగింపు పలకాలని భావించిన సోము వీర్రాజు ట్విట‌ర్ వేదికగా క్షమాపణలు చెప్పారు.

Next Story