Rajasthan: కాంగ్రెస్‌కు షాక్.. పార్టీ సభ్యత్వానికి 400 మంది రాజీనామా!

దేశ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

By Srikanth Gundamalla  Published on  13 April 2024 7:10 AM GMT
congress, rajasthan, 400 leaders resign,

 Rajasthan: కాంగ్రెస్‌కు షాక్.. పార్టీ సభ్యత్వానికి 400 మంది రాజీనామా!

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా కాంగ్రెస్‌ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. రాజస్థాన్‌లో ఒకేసారి కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వానికి 400 మంది రాజీనామా చేశారు. దాంతో.. రాజస్థాన్‌లో ఈ పరిణామం హాట్‌ టాపిక్‌గా మారింది. రాజస్థాన్‌లో జరిగిన ఈ సంఘటనతో రాజస్థాన్‌ హస్తం పార్టీ నాయకత్వం కూడా షాక్‌కు గురైంది.

రాజస్థాన్‌లో కాంగ్రెస్‌, రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్‌ పార్టీ మధ్య పొత్తు ఖరారు అయ్యింది. ఈ నేపథ్యంలో పొత్తులో భాగంగా నాగౌర్‌ లోక్‌సభ స్థానం నుంచి ఆర్‌ఎల్‌పీ చీఫ్‌ హనుమాన్‌ బేనివాల్‌ను అభ్యర్థిగా నిలిపారు. కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్‌ బేనివాస్‌ పేరును ఖరారు చేసింది. కాంగ్రెస్ నేతలకు బేనివాల్‌ ఎంపిక నచ్చలేదు. ఈ క్రమంలోనే కొందరు కాంగ్రెస్ అగ్రనేలు బీజేపీ అభ్యర్థి జ్యోతి మిర్దాకు అనుకూలంగా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ విషయం తెలుసుకున్న బేనివాల్ సహా ఇతర కాంగ్రెస్ నేతలు హైకమాండ్‌కు తెలిపారు.

దీనిపై విచారణ జరిపిన కాంగ్రెస్ హైకమాండ్‌ చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగానే ముగ్గురు కాంగ్రెస్‌ నాయకులపై ఆరేళ్ల పాటు సస్పెండ్ విధించింది. సస్పెండ్ అయిన వారిలో మాజీ ఎమ్మెల్యే భరరామ్, కుచేరా మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ తేజ్‌పాల్‌ మీర్జా, సుఖరామ్‌ దొడ్వాడియాలు ఉన్నారు. ఇక కాంగ్రెస్‌ వారిని సస్పెండ్ చేయడంతో మనస్తాపం చెందిన నాయకులె పార్టీకి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే వీరి ముగ్గురికి మద్దతు తెలుపుతూ 400 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తాజాగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.


Next Story