కామారెడ్డిలో కేసీఆర్‌పై పోటీ చేస్తా: కాంగ్రెస్‌ నేత షబ్బీర్ అలీ

కామారెడ్డి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా తాను దిగుతానని.. కేసీఆర్‌పై పోటీ చేస్తానని అంటున్నారు కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ.

By Srikanth Gundamalla  Published on  23 Oct 2023 12:15 PM GMT
Shabbir ali, clarity,   KCR,  Kamareddy,

కామారెడ్డిలో కేసీఆర్‌పై పోటీ చేస్తా: కాంగ్రెస్‌ నేత షబ్బీర్ అలీ

తెలంగాణలో ఎన్నికల హీట్ కొనసాగుతోంది. అభ్యర్థుల ప్రకటన తర్వాత ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అదే క్రమంలో టికెట్ లభించక అసంతృప్తిలో ఉన్నవారిని బుజ్జగించేందుకు కూడా ఆయా పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని నియోజకవర్గాల్లో పోటీపై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా సీఎం కేసీఆర్‌ పోటీ చేస్తోన్న రెండు నియోజకర్గాల్లో ప్రతిపక్ష పార్టీల నుంచి ఎవరు పోటీకి దిగుతారనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే గజ్వేల్‌ బరిలో సీఎం కేసీఆర్‌కు పోటీగా బీజేపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ దిగిన విషయం తెలిసిందే. ఇక కామారెడ్డి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా తాను దిగుతానని.. కేసీఆర్‌పై పోటీ చేస్తానని అంటున్నారు ఆ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ.

కాంగ్రెస్‌ అధిష్టానం విడుదల చేసిన తొలి జాబితాలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ పేరు లేదన్న విషయం తెలిసిందే. కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని కేసీఆర్ జాబితా విడుదల చేశారు. దాంతో..అక్కడ కేసీఆర్‌కు పోటీగా బలమైన అభ్యర్థిని దించాలనే ఆలోచనలో కాంగ్రెస్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే షబ్బీర్‌ అలీ తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై క్లారిటీ ఇచ్చారు. కామారెడ్డి నుంచి కేసీఆర్‌పైనే పోటీ చేస్తానని కుండబద్దలు కొట్టారు. కామారెడ్డిలో ఇద్దరం తలపడదాని కేసీఆర్‌కు కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ సవాల్ విసిరారు. అయితే.. బీఆర్ఎస్‌ నాయకులు పథకం ప్రకారం తాను ఇతర నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ అధర్మ యుద్ధానికి పాల్పడితే కామారెడ్డి ప్రజలు తగిన తీర్పు ఇస్తారని అన్నారు షబ్బీర్ అలీ.

తాన పుట్టుక, చావు అంతా కామారెడ్డినే అని షబ్బీర్ అలీ అన్నారు. ఎల్లారెడ్డి, నిజామాబాద్, జూబ్లీహిల్స్‌కు పోటీ చేస్తానని బీఆర్ఎస్‌ అసత్య ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్రచారమంతా కేసీఆర్ కనుసన్నల్లోనే జరుగుతోందన్నారు. కామారెడ్డిలో ఉండను అని.. గజ్వేల్‌ ప్రజలతోనే ఉంటానని సీఎం కేసీఆర్ బహిరంగంగా చెప్పారంటూ విమర్శించారు. అయితే.. కేసీఆర్‌ కామారెడ్డి నుంచి పోటీ చేయడాన్ని స్వాగతిస్తున్నానని చెప్పారు. కేసీఆర్‌పై పోటీ చేసి ప్రజాక్షేత్రంలో తలపడతానని అన్నారు షబ్బీర్ అలీ. కుట్రలు, కుతంత్రాలు తనకు తెలియని.. నిజాయితీగా ఉండేవ్యక్తిని అని చెప్పుకొచ్చారు. గజ్వేలే తనకు సమస్తమని చెప్పిన కేసీఆర్‌కు కామారెడ్డి ప్రజలు సరైన సమాధానం చెప్పాలని షబ్బీర్ అలీ కోరారు.

Next Story