కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బ.. మాజీ కేంద్రమంత్రి ఆర్పీఎన్ సింగ్ రాజీనామా
Senior Congress leader RPN Singh quits party.మరికొద్ది రోజుల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు
By తోట వంశీ కుమార్ Published on 25 Jan 2022 8:55 AM GMTమరికొద్ది రోజుల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత ఆర్‌పీఎన్ సింగ్ కాంగ్రెస్ పార్టీని వీడారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఆయన లేఖ పంపారు. ఈ లేఖను తన సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఆర్‌పీఎన్ సింగ్.. తన రాజకీయ ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నట్లు రాసుకొచ్చారు.
Today, at a time, we are celebrating the formation of our great Republic, I begin a new chapter in my political journey. Jai Hind pic.twitter.com/O4jWyL0YDC
— RPN Singh (@SinghRPN) January 25, 2022
ఇక రాజీనామా లేఖను సోషల్ మీడియాలో పోస్టు చేయడానికి కొద్ది సమయం ముందు తన సోషల్ మీడియా బయోను మార్చారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇన్‌చార్జ్ అనే దాన్ని తొలగించి.. ఆ స్థానంలో 'my motto india, first, always' అని మార్చారు. ఏదీ ఏమైనప్పటికీ ఎన్నికలు సమీస్తున్న తరుణంలో ఆర్‌పీఎన్ సింగ్ పార్టీని వీడడం.. కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బేనని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఇక.. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆర్‌పిఎన్ సింగ్ మంగళవారం బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఆర్‌పిఎన్ సింగ్ బీజేపీలో చేరితే కాంగ్రెస్‌తో పాటు ఎస్పీ కూడా ప్రతికూల వాతావరణం ఏర్పడుతుందని వార్తలు వస్తున్నాయి. సింగ్ చేరికతో పూర్వాంచల్‌లో బీజేపీ లోతుగా చొచ్చుకుపోతారని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆర్‌పిఎన్ సింగ్.. యూపీ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో కాంగ్రెస్ పార్టీ ఆయనను చేర్చింది. ఈ సమయంలో ఆయన రాజీనామా చేయడం నిజంగా ఇది కాంగ్రెస్‌కు కోలుకోలేని విషయం. ఇదిలావుంటే.. బీజేపీలో చేరడం ద్వారా ఆర్పీఎన్ సింగ్ తన సొంత జిల్లా ఖుషీనగర్‌లోని పద్రౌనా స్థానం నుంచి పోటీ చేయవచ్చనే వార్తలు కూడా వచ్చాయి. అదే జరిగితే.. స్వామి ప్రసాద్ మౌర్యకు కష్టంగా మారొచ్చు. ఎందుకంటే ఆయన కూడా అదే స్థానం నుండి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
స్వామి ప్రసాద్ మౌర్యకు వ్యతిరేకంగా ఆర్‌పిఎన్ సింగ్‌ను బీజేపీ రంగంలోకి దించనుంది. పద్రౌనా రాజ కుటుంబానికి చెందిన ఆర్‌పిఎన్ సింగ్ పూర్తి పేరు కున్వర్ రతన్‌జిత్ ప్రతాప్ నారాయణ్ సింగ్. పద్రౌనా అనేది యుపీ, బీహార్ సరిహద్దులో ఉన్న ఒక పట్టణం. ఇది ప్రస్తుతం డియోరియా జిల్లా నుండి వేరు చేయబడి కుషీనగర్ జిల్లాగా చేయబడింది.
ఆర్‌పిఎన్ సింగ్ 1996, 2002, 2007 అసెంబ్లీ ఎన్నికలలో పద్రౌనా అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ టిక్కెట్‌పై మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. దీని తరువాత.. అతను 2009 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా ఎంపీ అయ్యాడు. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యుపీఏ ప్రభుత్వంలో హోం శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే.. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మాత్రం వరుసగా ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
నిజానికి 2009లో బీఎస్పీ నుంచి పోటీ చేసిన స్వామి ప్రసాద్ మౌర్యపై ఆర్పీఎన్ సింగ్ విజయం సాధించారు. పద్రౌనాతో పాటు ఖుషీనగర్‌లో ఆర్‌పిఎన్ సింగ్‌కు చాలా బలమైన పట్టుంది. అందుకే ఆర్పీఎన్ సింగ్ పద్రౌనా నుండి పోటీ చేయాలనుకుంటునట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో స్వామి ప్రసాద్ మౌర్య కూడా ఎస్‌పి నుండి సురక్షితమైన స్థానంలో పోటీ చేయాలని యోచిస్తున్నారు.
కాంగ్రెస్‌కు చెందిన ప్రముఖ నాయకులలో ఆర్పీఎన్ సింగ్ ఒకరు. కాంగ్రెస్ జాతీయ టీంలో కూడా సభ్యుడు. పార్టీ ఆయనను జార్ఖండ్ రాష్ట్ర ఇంచార్జిగా కూడా చేసింది. అయితే జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో ఆయన విభేదిస్తున్నారనే వార్తలు కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. గత కొన్ని నెలలుగా అతను ఒక రకమైన బ్యాక్‌గ్రౌండ్‌లోకి వెళ్లడానికి బహుశా ఇదే కారణం కావచ్చు. కాంగ్రెస్‌పై ఆర్పీఎన్ సింగ్ నైరాశ్యానికి ఇదే కారణమని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.