సొంత ప్రభుత్వంపై విమర్శలు చేసిన రాజస్థాన్‌ మంత్రిపై వేటు

సొంత ప్రభుత్వంపై విమర్శలు చేసిన మంత్రి రాజేంద్ర గూడాను పదవి నుంచి తొలగించారు రాజస్థాన్ సీఎం.

By Srikanth Gundamalla  Published on  22 July 2023 1:50 AM GMT
Rajasthan, Government, Minister Suspend, CM Gehlot,

సొంత ప్రభుత్వంపై విమర్శలు చేసిన రాజస్థాన్‌ మంత్రిపై వేటు

మహిళల భద్రత విసయంలో సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేశారు రాజస్థాన్‌ మంత్రి రాజేంద్ర గూడా. ఆయన విమర్శలు చేసిన కొద్ది గంటల్లో రాజస్థాన్ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ తీవ్రంగా స్పందించారు. సదురు మంత్రిపై తొలగింపు వేటు విధించారు. అయితే.. రాజస్థాన్‌లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మణిపూర్‌లో హింసాకాండను రాష్ట్ర అసెంబ్లీలో లేవనెత్తే బదులు.. సొంత ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాలని రాజేంద్రగూడ వ్యాఖ్యానించారు. రాజేంద్ర గూడ చేసిన వ్యాఖ్యలు రాజస్థాన్‌లో చర్చనీయాంశంగా మారాయి.

రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ కేబినెట్‌లో హోంగార్డు, పౌర రక్షణ, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా రాజేంద్ర గూడా బాధ్యతలు నిర్వహించారు. శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీలో రాజస్థాన్‌ కనీస ఆదాయ హామీ బిల్లు-2023పై చర్చ జరుగుతోంది. ఈ చర్చలో మే 4న మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్లకార్డులు చేతబట్టి నిరసన వ్యక్తం చేశారు. దాంతో అసెంబ్లీ సమావేశాలకు అంతరాయం ఏర్పడింది. మహిళలకు భద్రత కల్పించే అంశంపై రాజేంద్ర గూడా తన సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నించారు. రాజస్థాన్‌లో మహిలలకు భద్రత కల్పించడంలో రాజస్థాన్ ప్రభుత్వం విఫలమైంది అన్నారు. మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని, మణిపూర్ అంశాన్ని లేవనెత్తే ముందు సొంత రాజస్థాన్ ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాలని రాజేంద్ర గూడా వ్యాఖ్యనించారు.

రాజేంద్ర గూడా వ్యాఖ్యలతో అసెంబ్లీలో ఉన్న సొంత పార్టీ నాయకులంతా షాక్‌ అయ్యారు. అయితే.. ప్రభుత్వం మంత్రి రాజేంద్ర గూడా వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించింది. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే రాజేంద్ర గూడాను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ సీఎం అశోక్‌ గెహ్లాట్ ఆదేశాలు జారీ చేశారు. మంత్రిని తొలగించడంతో సంచలనంగా మారింది.

కాగా.. తనను మంత్రి పదవి నుంచి తొలగించడాన్ని రాజేంద్ర గూడా ఖండించారు. మహిళల భద్రత గురించి వాస్తవాలు మాట్లాడితే మంత్రి పదవి నుంచి తొలగిస్తారా? అని ప్రశ్నించారు. తాను ఎప్పుడూ నిజాలే మాట్లాడతానని, వాస్తవాలే చెబుతానని అన్నారు. నిజాలు చెప్పినందుకే తనని శిక్షించారంటూ చెప్పుకొచ్చారు రాజేంద్ర గూడా. రాజస్థాన్‌లో మహిళలపై వేధింపుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. నా సొంత అసెంబ్లీ నియోజకవర్గం ఉదయ్‌ పూర్వతిలోని మహిళలకు తాను రక్షణ కల్పిస్తానని నమ్మి నన్ను ఎన్నికల్లో గెలిపించారు. కానీ మహిళలపై వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయని రాజేంద్ర గూడా అన్నారు.

రాజేంద్ర గూడాను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ పంపిన సిఫార్సును ఆ రాష్ట్ర గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా కూడా వెంటనే ఆమోదించారు. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం నుంచి కూడా అధికారిక ప్రకటన విడుదలైంది.


Next Story