సొల్యూషన్ చెప్పండి సార్.. పెద్ద.. పెద్ద స్పీచ్ లు అవసరం లేదు..!
Rahul Gandhi says give country solution not hollow speeches.మోదీ పెద్ద పెద్ద స్పీచ్ లు అవసరం లేదని.. సొల్యూషన్ ఏమిటో చెప్పాలని రాహుల్ గాంధీ కోరారు.
By తోట వంశీ కుమార్ Published on 22 April 2021 7:37 AM GMTకాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీకి కరోనా సోకడంతో ప్రస్తుతం ఇంట్లో హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. తాజాగా ఆయన మాట్లాడుతూ భారతదేశం ప్రస్తుతం ఎంతో కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటూ ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పరిస్థితిని అదుపుచేసే క్రమంలో ఘోరంగా విఫలమైందని రాహుల్ గాంధీ విమర్శించారు. తాను ఇంట్లో క్వారెంటైన్ లో ఉన్నానని.. సామాజిక మాధ్యమాల్లో ఎన్నో హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. మంగళవారం నాడు మోదీ ఇచ్చిన స్పీచ్ లో ఏమీ లేదని అన్నారు. పెద్ద పెద్ద స్పీచ్ లు అవసరం లేదని.. సొల్యూషన్ ఏమిటో చెప్పాలని రాహుల్ గాంధీ కోరారు.
భారతదేశం కరోనా మహమ్మారితో మాత్రమే పోరాడడం లేదని.. కొందరు నాయకుల పాలసీలకు వ్యతిరేకంగా కూడా పోరాడుతూ ఉందని ఆయన అన్నారు. టీకా ఉత్సవ్ లాంటివి అవసరం లేదని.. సమస్యలకు పరిష్కారాలు ఉంటే చూడాలని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. అంతకు ముందు కూడా రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ పాలసీని తీవ్రంగా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వ్యాక్సిన్ పాలసీని నోట్లరద్దుతో పోల్చారు. వ్యాక్సిన్ పాలసీ నోట్లరద్దు కంటే తక్కువేం కాదని, సామాన్య ప్రజలు క్యూలైన్లలో నిల్చుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆరోగ్యం, ఆస్తులు, చివరకు ప్రాణాలూ కోల్పోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పాలసీ వల్ల చివరికి కొందరు బడా పారిశ్రామికవేత్తలకే లాభం చేకూరుతుందని అన్నారు.
విపక్షాల సలహాలను కేంద్ర ప్రభుత్వం స్వీకరించడం లేదని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని మన్మాహన్ సింగ్ ఇచ్చిన సలహాలను కూడా మోదీ ప్రభుత్వం పాటించడం లేదని.. పబ్లిసిటీని పక్కనపెట్టి, ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించాలని సూచించారు. పాకిస్థాన్ కు చెందిన ఐఎస్ఐతో మాట్లాడేందుకు కూడా కేంద్రం సిద్ధంగా ఉందని కానీ, విపక్ష నేతల మాటలను వినేందుకు మాత్రం ఇష్టపడటం లేదని అన్నారు. విపక్షాలకు చెందిన నేతలు కేంద్రానికి మంచి సలహాలను ఇవ్వడం లేదని తాను భావించడం లేదని ఈ క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం వెనుకే అన్ని పార్టీలు ఉన్నాయని చెపుతున్నానని ప్రియాంక చెప్పారు. మన్మోహన్ సింగ్ ఈ దేశానికి పదేళ్లు ప్రధానిగా సేవలందించారని ఆయన ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అనే విషయం అందరికీ తెలుసని అన్నారు. అలాంటి వ్యక్తి ఇచ్చే సూచనలను అంతే గౌరవంతో స్వీకరించాలని చెప్పారు.