రాష్ట్రపతి ఎన్నిక.. ద్రౌపది ముర్ముకు వైసీపీ మద్దతు
Presidential poll Jagan to support NDA nominee Draupadi Murmu.రాష్ట్రపతి ఎన్నికల్లో తమ మద్దతు ఎవరికో వైసీపీ
By తోట వంశీ కుమార్ Published on 24 Jun 2022 9:42 AM ISTరాష్ట్రపతి ఎన్నికల్లో తమ మద్దతు ఎవరికో వైసీపీ చెప్పేసింది. ఎన్డీయే అభ్యర్థిగా పోటి చేస్తున్న ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించింది. స్వతంత్ర భారత దేశ చరిత్రలో రాష్ట్రపతి అభ్యర్థిగా తొలిసారిగా గిరిజన మహిళ కు అవకాశం ఇవ్వడం శుభ పరిణామమని వైసీపీ తెలిపింది. ఇక గడిచిన మూడేళ్లుగా దేశంలో ఎక్కడా లేని రీతిలో సామాజిక న్యాయాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపిన్నామని, సామాజిక న్యాయం పాటించడం కోసం ద్రౌపది ముర్ముకు మద్దతు తెలియజేస్తున్నట్లు వైసీపీ తెలిపింది.
అయితే.. ముందుగా నిర్ణయించిన మంత్రివర్గ సమావేశం కారణంగా నామినేషన్ దాఖలు కార్యక్రమానికి సీఎం జగన్ హాజరు కావడం లేదు. బదులుగా రాజ్యసభ సభ్యుడు, పార్టీ పార్లమెంటరీ వ్యవహారాల నేత విజయసాయిరెడ్డి, లోక్‌సభ పార్టీ నేత మిధున్‌రెడ్డి హాజరుకానున్నారు.
నేడు నామినేషన్ దాఖలు చేయనున్న ద్రౌపది ముర్ము
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా పోటి చేస్తున్న ద్రౌపది ముర్ము నేడు(శుక్రవారం) నామినేషన్ దాఖలు చేయనున్నారు. రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీకి ఆమె నామినేషన్ పత్రాలను ఉదయం 10.30 గంటలకు సమర్పించనున్నారు. నామినేషన్ వేసే సమయంలో ద్రౌపది ముర్ము వెంట ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు, పలువురు ముఖ్యమంత్రులు ఉండనున్నారు. ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వాన్ని 50 మంది ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు ప్రతిపాదించి, మరో 50 మంది బలపరచాల్సి ఉంది.
నామినేషన్ దాఖలు చేసేందుకు ద్రౌపది ముర్ము గురువారమే ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ చేరుకున్న అనంతరం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాతో ముర్ము భేటీ అయ్యారు.