సీఎం కేసీఆర్‌తో ప్రశాంత్ కిశోర్ భేటీ
Prashant Kishor holds talks with CM KCR.రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు
By తోట వంశీ కుమార్ Published on 24 April 2022 12:28 PM ISTరాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌తో శనివారం భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య ఉదయం నుంచి రాత్రి వరకు చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై వీరిద్దరూ విస్తృతంగా చర్చించారు. ఇటీవల కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరుపుతున్న ప్రశాంత్ కిశోర్.. నేడో, రేపో కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న వార్తలు బలంగా వినిపిస్తున్న తరుణంలో సీఎం కేసీఆర్‌తో సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఆదివారం మరోసారి సమాలోచనలు కొనసాగనున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. టీఆర్ఎస్ తో గతంలోనే పీకే కు ఒప్పందం జరిగింది. ఒప్పందం మేరకు పీకే రాష్ట్రంలో తమ బృందంతో కలిసి పలు నియోజకవర్గాల్లో రాజకీయ, పాలన పరిస్థితులపై ఓ సర్వే నిర్వహించారు. తొలుత 30 నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించి ఫలితాలను అందించగా.. ఆ తరువాత మరో 89 నియోజకవర్గాల సర్వే నిర్వహించారు. తాజాగా ఆ సర్వే కు సంబంధించిన ఫలితాలను కూడా సీఎం కేసీఆర్‌కు అందించినట్లు తెలుస్తోంది.
సీఎం కేసీఆర్, ప్రశాంత్ కిషోర్ లు ఆదివారం మరోసారి భేటీ కానున్నారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ, ఇతర రాజకీయపరమైన ముఖ్య అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక త్వరలోని తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పార్టీ 21 ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 27న హైదరాబాద్‌లో పార్టీ ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. అందులో పీకే సర్వే, టీఆర్ఎస్ బలోపేతానికి సంబంధించి చర్చించే అవకాశం ఉంది.