ప్రశాంత్ కిషోర్ కీలక ప్రకటన.. అక్టోబర్ 2 నుంచి పాదయాత్ర
Prashant Kishor announces 3000 km Padyatra from Champaran.ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మొన్నటి వరకు
By తోట వంశీ కుమార్ Published on 5 May 2022 12:17 PM ISTఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో చేరుతారంటూ వార్తలు రాగా.. తాను ఏ పార్టీలో చేరడం లేదని చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఆయన కొత్త పార్టీ పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ 2 నుంచి బిహార్ రాష్ట్రంలో మూడు వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నట్లు వెల్లడించారు. ఢిల్లీలో నేడు(గురువారం) ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాలూ, నితీష్ పరిపాలనలో బీహార్ అత్యంత వెనుకబడిన రాష్ట్రంగా మిగిలిపోయిందన్నారు. రాబోయే పది, పదిహేను సంవత్సరాల కాలంలో బీహార్ ప్రగతిశీల రాష్ట్రంగా ఎదగాలంటే ఇప్పుడున్న దారిలో వెళితే సాధ్యం కాదన్నారు. కొత్త ఆలోచన, కొత్త ప్రయత్నం ద్వారానే ఇది సాధ్యమని, ప్రజలంతా కలసికట్టుగా అడుగు ముందుకేస్తే ఇప్పుడున్న పరిస్థితుల నుంచి బయటపడతామన్నారు.
అంతేకాకుండా.. ఇప్పుడు ఎలాంటి రాజకీయ పార్టీ, రాజకీయ వేదికను తాను ప్రకటించను అంటూ స్వంత పార్టీపై క్లారిటీ ఇచ్చారు. తనకున్న సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని బీహార్ కోసం ఉపయోగిస్తానని చెప్పుకొచ్చారు. 'జన్ సురాజ్' కోసం రాబోయే మూడు, నాలుగు నెలలో అందరినీ కలిసి మాట్లాడుతాని, తన అభిప్రాయంతో ఏకీభవించి వచ్చే వారిని తనతోటి చేర్చుకుంటానని తెలిపారు. తాను పార్టీ పెడితే అది ప్రశాంత్ కిషోర్ పార్టీ కాదని, అందరి పార్టీగా ఉంటుందని చెప్పారు.
బీహార్ ప్రజల సమస్యలు, వారి ఆకాంక్షలను తెలుసుకోవడం కోసం గాంధీ జయంతి(అక్టోబర్ 2న) ని పురస్కరించుకుని పశ్చిమ చంపారన్‌లోని గాంధీ ఆశ్రమం నుంచి పాదయాత్ర చేపట్టనున్నట్లు పీకే తెలిపారు. 3 వేల కిలోమీటర్ల పాదయాత్రలో ఇంటింటికి వెళ్లి క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకుంటానని అన్నారు.