అటు నాని గారు.. ఇటు చిన్ని గారు..!

Political War Between Kesineni Brothers. రాజకీయాల్లో బెజవాడ స్టైలే వేరు. అక్కడ గల్లీ స్థాయి లీడర్ చేసే వ్యాఖ్యలు కూడా రాష్ట్రవ్యాప్తంగా

By సునీల్  Published on  2 Aug 2022 5:20 PM IST
అటు నాని గారు.. ఇటు చిన్ని గారు..!

బెజవాడలో అన్నదమ్ముల సవాల్

హీటెక్కిస్తున్న రాజకీయం

రాజకీయాల్లో బెజవాడ స్టైలే వేరు. అక్కడ గల్లీ స్థాయి లీడర్ చేసే వ్యాఖ్యలు కూడా రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని రేపుతాయి. అలాంటిది రాజధానిలో కీలకమైన విజయవాడ ఎంపీ విషయం కావడంతో పొలిటికల్ సర్కిళ్లలో తీవ్ర చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా ఫ్యాన్ గాలి వీచినా.. బెజవాడలో మాత్రం కేశినేని శ్రీనివాస్(నాని) పసుపు జెండా రెపరెపలాడించారు. రాజధాని ప్రాంతంలో వరుసగా రెండుసార్లు గెలవడం ఆషామాషీ ఏమీ కాదు. అలాంటి చోట విజయం సాధించిన నానికి ఇప్పుడు సొంత ఇంటి నుంచే సెగ తగులుతోంది.

కేశినేని నాని సోదరుడు కేశినేని విశ్వనాథ్ అలియాస్ చిన్ని.. గతంలో కొద్ది మందికే తెలిసిన ఈ పేరు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా మార్మోగుతోంది. అందుకు కారణం అన్న నియోజకర్గంలో సొంత వర్గాన్ని తయారు చేసుకుని పోటీకి సై అంటుండటం. నాని లోక్ సభ సమావేశాలు, రాష్ట్రపతి ఎన్నిక, కుమార్తె వివాహ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. అదే సమయంలో చిన్ని విజయవాడ పార్లమెంట్ పరిధిలోని గ్రామగ్రామాలనూ చుట్టేస్తున్నారు. ఆయన అనుచరులు కూడా రాబోయే ఎన్నికల్లో ఎంపీ సీటు చిన్నికే అంటూ ప్రచారం చేస్తున్నారు.

వంగవీటితో భేటీ.. సర్వత్రా ఆసక్తి

బెజవాడలోనే కాకుండా.. రాష్ట్రవ్యాప్తంగా పొలిటికల్ ఇమేజ్ ఉన్న ఫ్యామిలీ వంగవీటి రంగాది. రంగా తనయుడే వంగవీటి రాధాకృష్ణ. ప్రస్తుతం తెలుగుదేశంలో కొనసాగుతున్నా అంత చురుకుగా లేరన్న ప్రచారం ఉంది. ఇదిలా ఉంటే నియోజకవర్గాన్ని చుట్టేస్తున్న కేశినేని చిన్ని తాజాగా వంగవీటి రాధాతో భేటీ అయ్యారు. దీనిపై పొలిటికల్ వర్గాల్లోనే కాక కుల సంఘాల్లోనూ చర్చకు దారి తీసింది. మర్యాదపూర్వక భేటీ అని ఇరువురు నేతలు పైకి చెబుతున్నారు. కానీ కేశినేని బ్రదర్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సమయంలో వీరిద్దరూ కలవడం చర్చనీయాంశంగా మారింది.

అన్న కన్నా చంద్రబాబే ఎక్కువ..

ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా బెజవాడలో మాత్రం ముందుగానే ఆ వేడి కనిపిస్తోంది. చిన్ని పోటీ విషయాన్ని నాని అనుచరులు తేలిగ్గా కొట్టి పారేస్తున్నారు. కేశినేని నాని కూడా తనకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదని నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు చిన్ని మాత్రం చంద్రబాబు ఆదేశిస్తే నానిపైన అయినా పోటీకి సిద్ధమంటున్నారు. చంద్రబాబు, టీడీపీ తర్వాతే తన అన్న అయినా అంటూ బరిలో నిలుస్తానంటున్నారు. అయితే ఈ విషయాన్ని చంద్రబాబు ఇంకా సీరియస్‌గా తీసుకున్నట్టు లేరు. అన్నదమ్ములు సవాళ్లు విసురుకుంటున్నా, రాజకీయ రచ్చ జరుగుతున్నా అధిష్టానం నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడం విశేషం.


Next Story