ప్రధాని టూర్‌లో సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం.. ఈసారైనా వెళ్తారా? లేదా?

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8 తెలంగాణలో పర్యటించనున్నారు.

By Srikanth Gundamalla  Published on  6 July 2023 9:01 AM GMT
PM Modi, Telangana, Tour, CM KCR,

ప్రధాని టూర్‌లో సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం.. ఈసారైనా వెళ్తారా? లేదా? 

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8 తెలంగాణలో పర్యటించనున్నారు. ఉమ్మడి వరంగల్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ అధికారిక పర్యటన షెడ్యూల్‌ విడుదలైంది. ఈ క్రమంలో ప్రోటోకాల్ ప్రకారం ప్రధాని వరంగల్ పర్యటనకు రావాలని సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం కూడా అందింది. గత కొన్నాళ్లుగా ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ ఆహ్వానం పలకడం లేదు. ఏ కార్యక్రమాలు జరిగినా హాజరుకావడం లేదు. ఈ సారైనా ప్రధాని మోదీ పర్యటనకు సీఎం కేసీఆర్ వెళ్తారా..? ప్రధానికి ప్రోటోకాల్‌ ప్రకారం ఆహ్వానం పలుకుతారా అనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో జరుగుతోంది.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాలనను సీఎం కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అవకాశం వచ్చిన ప్రతిసారి కేసీఆర్‌తో సహా బీఆర్ఎస్ నాయకులంతా మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తెలంగాణకు కేంద్రం చేసిందేమీ లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక బీజేపీ నాయకులు కూడా కేసీఆర్ సర్కార్‌కు కౌంటర్ ఇస్తున్నారు. కేంద్రం కావాల్సినవన్నీ సమకూర్చిందని చెబుతున్నారు. బీజేపీ గద్దె దించాలనే లక్ష్యంతోనే కేసీఆర్ టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చారు. జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అంతకు ముందు నుంచే కేసీఆర్ ప్రధాని పర్యటనలకు దూరంగా ఉంటున్నారు. ప్రొటోకాల్ ప్రకారం ప్రధానికి ఆహ్వానం కూడా పలకడం లేదు. ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తెలంగాణకు వస్తున్నారు. ఈసారి ప్రధాని పర్యటనలో సీఎం కేసీఆర్ పాల్గొంటారా లేదా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.

గతంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని ప్రధాని పర్యటనలో పాల్గొన్నారు. ఆయనే ఆహ్వానం పలికారు. ఇక ఆయా కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. ఆ తర్వాత ప్రధాని తిరుగు పయనం అయితే.. వీడ్కోలు కూడా మంత్రి తలసానే పలికారు. అసలే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ క్రమంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.? హకీంపేట ఎయిర్‌పోర్టులో ప్రధానికి స్వాగతం పలుకుతారా? లేదంటే మునుపటి లానే ప్రధాని పర్యటనకు దూరంగా ఉంటారా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే. కొందరు ఈసారి కేసీఆర్ మోదీ టూర్‌లో పాల్గొంటారని అంటుంటే.. లేదు కేంద్ర విధానాలను తప్పుబట్టి తీవ్రంగా విమర్శలు చేశారు కేసీఆర్. ఏదో ఒక సాకుతో కచ్చితంగా పర్యటనలో పాల్గొనరని చెబుతున్నారు.

కాగా.. జూలై 8న ప్రధాని వరంగల్‌లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. హన్మకొండ ఆర్ట్స్‌ కాలేజ్‌ ప్రాంగణంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్స్‌ పార్క్‌, రహదారుల పనులకు భూమిపూజ, కాజీపేటలో రైల్వే వ్యాగన్ల యూనిట్‌క ప్రధాని మోదీకి శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణలో రూ.6,100 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని. ఎన్నికల సమయం కావడంతో తెలంగాణ బీజేపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది.

Next Story