ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనపై ప్రధాని కీలక వ్యాఖ్యలు
PM Modi Sensational comments on Andhra Pradesh Reorganisation.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనపై ప్రధాని నరేంద్ర
By తోట వంశీ కుమార్ Published on 8 Feb 2022 8:39 AM GMTఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఈ క్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశాన్ని ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ హడావుడిగా విభజించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరిగిన తీరుతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఇప్పటికీ నష్టపోతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన సరిగ్గా చేసి ఉంటే ఎలాంటి సమస్యలు ఉండేవి కావన్నారు.
కాగా.. రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకం కాదని చెప్పారు. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసిందన్నారు. ఆ సమయంలో అందరూ కలిసి కూర్చుని, చర్చించి ఆ రాష్ట్రాల ఏర్పాటు బిల్లులను పాస్ చేశారని గుర్తు చేశారు. అయితే.. ఏపీ, తెలంగాణ విషయంలో అలా జరగలేదన్నారు. తలుపులు మూసి పేపర్ స్ప్రే కొట్టారని నాటి ఘటనలను గుర్తుచేశారు. ఎలాంటి చర్చ జరగకుండానే విభజన బిల్లును ఆమోదించారన్నారు. ఇదేనా ప్రజాస్వామ్య పద్దతి.? అంటూ కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణ మధ్య వైషమ్యాలకు కాంగ్రెస్సే కారణమన్నారు.
యూపీఏ 2 ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌గా కాంగ్రెస్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. విభజన చట్టంలో పేర్కొన్న అనేక అంశాలు ఇప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. ఎన్నో దఫాలుగా అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కారం కాని సమస్యలు ఉన్నాయి.