యువగళం సభకు పవన్.. వైసీపీ మాటలు నమ్మొద్దన్న జనసేనాని
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగియనుంది.
By Srikanth Gundamalla Published on 18 Dec 2023 12:26 PM ISTయువగళం సభకు పవన్.. వైసీపీ మాటలు నమ్మొద్దన్న జనసేనాని
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగియనుంది. పాదయాత్ర సోమవారం విశాఖ జిల్లా అగనంపూడి వద్ద ముగుస్తుంది. చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ ఏడాది జనవరి 27న నారా లోకేశ్ పాదయాత్రను ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన వస్తున్నా మీకోసం పాదయాత్రనూ అగనంపూడి వద్దే ముగించారు. అదే సెంటిమెంట్‌తో నారా లోకేశ్ ఆయన పాదయాత్ర కూడా అగనంపూడి వద్దే ముగిస్తున్నారు. కాగా.. పాదయాత్ర ముగింపు సందర్భంగా డిసెంబర్ 20న విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద విజయోత్సవ సభను నిర్వహిస్తోంది టీడీపీ. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చే అవకాశాలు ఉన్నాయి. దాంతో పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తోంది.
మరోవైపు ఏపీలో టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ఈ విజయోత్సవ సభకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రావాలని ముందుగా టీడీపీ కోరింది. అయితే.. ఆయనకు ముందే నిర్ణయించిన ఇతర పనులు ఉండటం వల్ల రాలేనని చెప్పారు. కానీ.. తర్వాత ఏపీ మాజీ సీఎం చంద్రబాబు స్వయంగా వెళ్లి పవన్ కళ్యాణ్‌ను కలిశారు. వీరిమధ్య చాలాసేపు చర్చలు జరిగాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నారా లోకేశ్ యువగళం పాదయాత్ర విజయోత్సవ సభకు వచ్చేందుకు ఒప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సభా వేదిక ద్వారా టీడీపీ, జనసేన ఉమ్మడిగా సార్వత్రిక ఎన్నికల శంఖారావం పూరించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. రెండు పార్టీలు అదే రోజున కీలక ప్రకటన చేసే అవకాశాలూ కనిపిస్తున్నాయి. ఈ సభకు లక్షలాదిగా ఇరు పార్టీల శ్రేణులు రానున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఏడు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.
ఈ మేరకు జనసేన పార్టీ సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ తమ పార్టీ శ్రేణులకు ఒక సందేశాన్ని కూడా పంపారు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చడానికి, జనసేన-టీడీపీ పొత్తు భగ్నం చేయడానికి వైసీపీ నాయకులు మైండ్ గేమ్స్ మొదలు పెట్టారని ఆరోపించారు. దాంట్లో భాగంగా వైసీపీ నాయకులు, ఆ పార్టీ అధినేత వ్యక్తిగత విమర్శలకూ దిగుతున్నారు. లేకి వ్యాఖ్యలు చేయడం వంటివి చేస్తున్నారని పవన్ అన్నారు. ఈ నేపథ్యంలో జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు వాటిని పట్టించుకోవద్దన్నారు. కేవలం రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్యలపై మాత్రమే మాట్లాడాలని పవన్ కళ్యాణ్ తమ పార్టీ నాయకులకు సూచన చేశారు.
ప్రజా సమస్యల నుండి దృష్టి మరల్చడానికి, జనసేన-టీడీపీ పొత్తు భగ్నం చేయడానికి మైండ్ గేమ్స్ మొదలు పెట్టిన వైసీపీ. దాంట్లో భాగంగా వైసీపీ నాయకులతో పాటు వారి అధినాయకుడు కూడా వ్యక్తిగత విమర్శలకు దిగడం, లేకి వ్యాఖ్యలు చేయడం లాంటివి చేస్తున్నారు.
— JanaSena Party (@JanaSenaParty) December 18, 2023
జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు… pic.twitter.com/7wWaOYffXq