వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. అన్ని తెగించే రాజకీయాల్లోకి వచ్చానని, ఉడుత ఊపులకు, తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదంటూ కౌంటర్ ఇచ్చారు. ప్రజలకు, జనాలకు అన్యాయం జరుగుతుంటేనే తాను రోడ్లపైకి వచ్చినట్లు పవన్ చెప్పారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఇప్పటం ఇళ్ల కూల్చివేత బాధితులతో ఆయన సమావేశం అయ్యారు. బాధితులకు లక్ష చొప్పున ఆర్థిక సాయాన్ని పవన్ అందించారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జనసేనను రౌడీ సేన అంటున్న వైసీపీ నేతలకూ పవన్ కౌంటర్ ఇచ్చారు. తమది రౌడీసేన కాదని, విప్లవ సేన అని అన్నారు. రౌడీయిజం చేసేవాళ్లకు, గుండాయిజం చేసేవాళ్లకు ఎదురు తిరగడం రౌడీయిజమేనని వైసీపీ నేతలు భావిస్తున్నారని మండిపడ్డారు.
యువత కోసం ఆలోచించే నేతలు పాలకులుగా రావాలని పవన్‌కల్యాణ్ ఆకాంక్షించారు. ఇప్పటంలో గ్రామస్తుల గడపలు కూల్చడాన్ని తాను మరిచిపోనని చెప్పారు. అక్కడ కూల్చిన ప్రతిదీ తన గుండెపై కొట్టినట్లే అనిపించిందని అన్నారు. దేశం, రాష్ట్రంలో లంచాలు లేని వ్యవస్థే లక్ష్యమని, తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు దాని కోసం పోరాడతానని చెప్పారు.