ప్రజల భవిష్యత్ బాగుండాలనే పార్టీని పెట్టా: పవన్ కల్యాణ్
ఏపీలో ఎన్నికల వేళ ప్రచారంలో ఊపందుకున్నాయి రాజకీయ పార్టీలు.
By Srikanth Gundamalla
ప్రజల భవిష్యత్ బాగుండాలనే పార్టీని పెట్టా: పవన్ కల్యాణ్
ఏపీలో ఎన్నికల వేళ ప్రచారంలో ఊపందుకున్నాయి రాజకీయ పార్టీలు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనారోగ్యం కారణంగా కొద్ది గ్యాప్ తీసుకుని మళ్లీ ప్రచారంలో పాల్గొంటున్నారు. తాజాగా అనకాపల్లిలో పవన్ కల్యాణ్ వారాహి విజయభేరి సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అనకాపల్లి అంటే ఒకప్పుడు బెల్లం గుర్తుకు వచ్చేదనీ.. కానీ ఇప్పుడు కోడిగుడ్డు గుర్తుకు వస్తోందని పవన్ కల్యాణ్ అన్నారు.
ప్రజల అభిమానం లభించాలని ప్రతి రాజకీయ పార్టీకి ఉంటుందని పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన ఆ పరిస్థితిని అధిగమించి రాష్ట్రం బాగుండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. సీట్ల సర్దుబాటుకు ముందుకు వచ్చి టీడీపీతో పొత్తు పెట్టుకుందని పవన్ వివరించారు. ఒక తప్పు కూడా జరగొద్దనే ఉద్దేశంతోనే టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పనిచేస్తున్నాయని పవన్ కల్యాణ్ వివరించారు. రాజకీయ పార్టీని నడపడం అంత సులభం కాదనీ.. తన ఒక్కి ప్రయోజనాల కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని పవన్ అన్నారు. ప్రజల భవిష్యత్ కోసమే తాను రాజకీయ పార్టీ పెట్టానని అన్నారు. తనకు మంత్రి పదవి కావాలని కోరుకుంటే ఎప్పుడో దక్కేదని.. కానీ తనకు పదవులు ముఖ్యం కాదని పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం పనిచేస్తున్నట్లు వివరించారు.
అనకాపల్లి స్థానం జనసేదే అయినప్పటికీ.. బీజేపీ అధిష్టానం అభ్యర్థన మేరకు సీఎం రమేశ్ అభ్యర్థిత్వాన్ని మనస్ఫూర్తిగా బలపరుస్తున్నట్లు పవన్ చెప్పారు. తాను ఒక ఉద్యోగి కొడుకుని అని చెప్పారు. సగటు జీవికి పెన్షన్ ఎంత అవసరమో తనకు తెలుసన్నారు. సినీ రంగంలో ఎదిగాక కూడా తన తండ్రి తమ వద్ద డబ్బులు తీసుకునే వారు కాదని అన్నారు. ఆయన తన పెన్షన్ డబ్బులోంచే తమకు ఇచ్చేవారిని చెప్పారు. అందుకే తమ ప్రభుత్వం వచ్చాక ఏడాది లోపు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)కు పరిష్కారం చూపించే కృషి చేస్తామని అన్నారు. ఇక రాష్ట్రంలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలొద్దని పవన్ కల్యాణ్ అన్నారు.