నారా లోకేశ్‌ను కలిసి పూర్తి మద్దతు తెలిపిన జనసేన నేతలు
చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ రాజమండ్రిలో ఉన్న నారా లోకేశ్‌ను జనసేన నేతలు కలిశారు.
By Srikanth Gundamalla Published on 12 Sept 2023 3:12 PM ISTనారా లోకేశ్‌ను కలిసి పూర్తి మద్దతు తెలిపిన జనసేన నేతలు
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌తో ఏపీలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఓ వైపు టీడీపీ చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు, నిరసనలకు పిలుపునిస్తోంది. చంద్రబాబు అరెస్ట్‌ను ఇతర పార్టీ నేతలు కూడా ఖండిస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ రాజమండ్రిలో ఉన్న నారా లోకేశ్‌ను జనసేన నేతలు కలిశారు. చంద్రబాబు అరెస్ట్‌ను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. టీడీపీకి జనసేన తరఫున పూర్తి మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు ఆ పార్టీ నాయకులు. మనో ధైర్యంతో ముందుకు వెళ్లాలని.. సీఎం జగన్ దుర్మార్గ పాలనపై కలిసి పోరాడేందుకు వస్తామని చెప్పారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం స్కాం కేసులో చంద్రబాబు తప్పు చేశారని ఆధారాలు లేకపోయినా.. సీఐడీ అధికారులు ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేశారని విమర్శించారు.
అయితే.. చంద్రబాబు అరెస్ట్‌ను ఎవరు ఖండించినా వారిని కూడా వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారని జనసేన నేతలు చెప్పారు. ఎన్నికల తర్వాత వైసీపీ భూస్థాపితం కావడం ఖాయమని చెప్పారు. టీడీపీకి మద్దతు తెలిపి నిరసనలు, బంద్‌లో పాల్గొన్నందుకు జనసేన నేతలకు నారా లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడిన నారా లోకేశ్ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్ట్‌పై వర్గాలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రజలు తీవ్ర ఆవేదనతో ఉన్నారని అన్నారు. చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ పరిణామాలు చూసి తట్టుకోలేక పలువురు చనిపోయారనే వార్త రావడంతో తీవ్ర ఆవేదన చెందానని లోకేశ్ తెలిపారు. టీడీపీ అభిమానులు, ప్రజలు, కార్యకర్తలు అధైర్య పడాల్సిన అవసరం లేదని చెప్పారు. చివరకు విజయం సత్యానిదే అన్నారు నారా లోకేశ్. చంద్రబాబుని అరెస్ట్ చేసిన అంశం జగన్ కక్షపూరిత చర్య అని దేశమంతా గుర్తించిందని లోకేశ్ అన్నారు. చంద్రబాబుని అరెస్ట్ చేయడం పట్ల న్యాయపోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా మరోసారి తెలిపారు నారా లోకేశ్.