చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు టీఆర్ఎస్ ను వీడారు. తన సతీమణి, మంచిర్యాల జడ్పీ చైర్‌పర్సన్ భాగలక్ష్మీతో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీ వెళ్లిన ఓదెలు దంపతులు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నేతృత్వంలో గురువారం మధ్యాహ్నాం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ.. ఓదెలు దంపతులకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
2009, 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున నల్లాల ఓదేలు విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2010లో జరిగిన ఉప ఎన్నికలోనూ ఆయన గెలుపొందారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతప్రభుత్వ విప్‌గానూ ఓదెలు పనిచేశారు.
టీఆర్ఎస్ వీడడానికి కారణం అదేనా..?
చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో బాల్క సుమన్, నల్లాల ఓదేలు మధ్య విబేధాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఓదెలు పార్టీని వీడినట్లు సమాచారం. గత కొద్ది రోజులుగా సన్నిహితులు, అభిమానులు, కుటుంబ సభ్యులతో విస్తృతంగా చర్చించారు. అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుని టీఆర్ఎస్‌ని వీడి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు.