ఇదేమి ట్విస్ట్.. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రెండు నెలల్లో కూల్చేస్తామంటున్న ఎంఐఎం నేత

Mumtaz Ahmad Khan Comments On TRS. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ, మజ్లీస్ పార్టీ ఒకటే కూటమంటూ

By Medi Samrat  Published on  22 Nov 2020 7:29 PM IST
ఇదేమి ట్విస్ట్.. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రెండు నెలల్లో కూల్చేస్తామంటున్న ఎంఐఎం నేత

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ, మజ్లీస్ పార్టీ ఒకటే కూటమంటూ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ప్రచారం చేస్తూ ఉన్నాయి. బీజేపీ అయితే మేయర్ పదవిని మజ్లీస్ పార్టీకే టీఆర్ఎస్ కట్టబెట్టబోతోందంటూ ప్రచారం చేస్తోంది. ఇలాంటి సమయంలో చార్మినార్‌ ఎమ్మెల్యే, మజ్లీస్ పార్టీ సీనియర్‌ నేత ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాము తలుచుకుంటే రెండు నెలల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని కూల్చేయగలమని.. మజ్లీస్ పార్టీ చాలా మందిని చూసిందని చెప్పుకొచ్చారు. కేటీఆర్‌ నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చిన చిలుక అని ఎద్దేవా చేశారు. తమకు రాజకీయాల్లో ఒకరిని గద్దే మీద కూరోచబెట్టడం తెలుసు.. గద్దె దించడం తెలుసు అని హెచ్చరికలు పంపారు. తమ అధినేత చెప్పినట్టు రాజకీయం తమ ఇంటి గుమస్తాతో సమానం అని అన్నారు.

ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించారు. బీజేపీపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. బీజేపీ నేతలను నిద్రలేపి కొన్ని పేర్లు చెప్పమంటే వాళ్లు చెప్పే పేర్లలో తన పేరు తప్పకుండా ఉంటుందని.. నా పేరు మాత్రమే కాకుండా ఉగ్రవాదం, ద్రోహం, పాకిస్థాన్ అనే పేర్లను కూడా బీజేపీ నేతలు ఎక్కువగా పలుకుతుంటారని వ్యాఖ్యానించారు.

హైదరాబాద్ లో వరదలతో తల్లడిల్లిపోయిన నగర ప్రజలకు మోదీ సర్కారు చేసిందేమీ లేదని అన్నారు. హైదరాబాదుకు బీజేపీ ఏమీ చేయలేదు కాబట్టే ఇప్పుడు మతం పేరుతో ఓట్లు సంపాదించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ ఎత్తులు ఇక్కడ పనిచేయవని, నగర ప్రజలకు ఎవరు ఎలాంటివారో తెలుసని ఒవైసీ స్పష్టం చేశారు.


Next Story