చంద్రబాబు వద్ద కాపుల ఆత్మగౌరవాన్ని పవన్ తాకట్టుపెట్టారు: ముద్రగడ
ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు హీట్ ఎక్కాయి.
By Srikanth Gundamalla
చంద్రబాబు వద్ద కాపుల ఆత్మగౌరవాన్ని పవన్ తాకట్టుపెట్టారు: ముద్రగడ
ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు హీట్ ఎక్కాయి. రాజకీయ పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కాపు ఉద్యమ నేత, వైసీపీ నాయకులు ముద్రగడ పద్మనాభం సీరియస్ అయ్యారు. జనసేన కార్యకర్తలను కూడా పవన్ కల్యాణ్ దగ్గరకు రానీయడని అన్నారు. అలాంటి పవన్‌పై కిరాయి మూకలు, సిబ్బందిపై బ్లేడ్ బ్యాచ్ ఎలా దాడి చేస్తారని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ చుట్టూ ఎప్పుడూ బౌన్సర్లు ఉంటారు. వారిని దాటి ఎవరూ వెళ్లలేరని చెప్పారు. రాజమండ్రిలోని బొమ్మూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముద్రగడ పద్మనాభం ఈ కామెంట్స్ చేశారు.
పిరికితనం, చేతకానితనంతోనే పవన్ కల్యాణ్ ఇలా మాట్లాడుతున్నారని ముద్రగడ పద్మనాభం అన్నారు. బ్లేడ్ బ్యాచ్ వచ్చి కోసేస్తున్నప్పుడు రాజకీయాలు మానేయాలంటూ హితవు పలికారు. పవన్ కల్యాణ్ అసలు ప్రజలను ముట్టుకోరు.. వారిని ముట్టుకోనివ్వరంటూ కామెంట్స్ చేశారు. తామంతా ప్రజల్లోనే తిరుగుతున్నామనీ.. తమపై బ్లేడ్ బ్యాచ్ ఎందుకు దాడి చేయడం లేదని అన్నారు. మరోవైపు కాపుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు వద్ద పవన్ కల్యాణ్ తాకట్టు పెట్టేశాడని విరుచుకుపడ్డాడు. పవన్ కల్యాణ్ చేసవన్నీ బుద్ధి తక్కువ పనులే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద కాపుల ఆత్మగౌరవాన్ని పవన్ కల్యాణ్ తాకట్టు పెట్టారని మండిపడ్డారు.
సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. నిరుపేద ప్రజలంతా వైసీపీ వైపే ఉన్నారని చెప్పారు. మరోసారి వైసీపీ అధికారంలోకి రావడం పక్కా అని చెప్పారు. చంద్రబాబు కాపులను అనగదొక్కాలని చూస్తున్నారనీ.. కానీ జగన్ మాత్రం వారిని అక్కున చేర్చుకున్నారని అన్నారు. ఎలాగైనా చంద్రబాబుని అధికారంలోకి తేవాలన్న దురుద్దేశంతోనే పవన్ కల్యాణ్.. చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నారని ముద్రగడ పద్మనాభం అన్నారు. చంద్రబాబు, పవన్ లాంటి నీచ రాజకీయాలు చేసే వారిని ప్రజలు నమ్మరు అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలే వారికి సరైన బుద్ధి చెబుతారని ముద్రగడ పద్మనాభం అన్నారు.