నిరూపిస్తే బీఆర్ఎస్‌కు సేవ చేస్తా..కేటీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి సవాల్
మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు.
By Srikanth Gundamalla Published on 12 July 2023 2:53 PM ISTనిరూపిస్తే బీఆర్ఎస్‌కు సేవ చేస్తా..కేటీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి సవాల్
తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. దీంతో.. అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలకు వేడెక్కాయి. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. రాష్ట్రంలో చిన్న, సన్నకారు రైతులే ఎక్కువ ఉంటారు. వారికి 3 గంటలపాటు ఉచిత కరెంటు ఇస్తే సరిపోతుందని కామెంట్స్ చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్‌తో పాటు ఇతర బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలే టార్గెట్‌గా కాంగ్రెస్ పాలనను గుర్తు చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. 3 గంటల కరెంటే ఇస్తామంటున్నవారు కావాలా.. 24 గంటల కరెంటు ఇచ్చే కేసీఆర్ కావాలా అంటే కేటీఆర్ కామెంట్స్ చేశారు. అలా మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు సవాల్ విసిరారు.
రాష్ట్రంలో పది గంటల పాటు కరెంటు ఇస్తున్నట్లు చూపించాలని కేటీఆర్‌కు సవాల్ విసిరారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. అది నిరూపిస్తే సబ్ స్టేషన్‌లోనే రాజీనామా చేస్తానని అన్నారు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ ఎక్కడైనా సరే సబ్‌స్టేషన్‌కు వెళ్దాం రావాలని కేటీఆర్‌కు చాలెంజ్ విసిరారు. అక్కడ పుస్తకాల్లో 24 గంటల కరెంటు ఇస్తున్నట్లు చూపిస్తే తన జీవితాంతం బీఆర్ఎస్‌కు సేవ చేస్తానని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సవాల్ విసిరారు. 24 గంటల కరెంటు ఇస్తున్నారని తేలితే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీలకు తానే స్వయంగా పాలాభిషేకం చేస్తానని అన్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యే దగ్గర రూ.1000 కోట్లు తిన్నది అరగకే ధర్నాలు చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులను విమర్శించారు. నా సవాల్‌ను స్వీకరించి ఎవరొచ్చినా సరే.. నాణ్యమైన కరెంటు 24 గంటల పాటు ఇస్తున్నట్లు నిరూపించాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సవాల్ విసిరారు.
ఇటీవల కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. ఆ గెలుపు జోష్‌తోనే తెలంగాణలోనూ దూసుకెళ్లాలని అధిష్టానం భావిస్తోంది. కానీ.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఉచిత కరెంట్‌పై చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీని చిక్కుల్లో పడేసినట్లు అయ్యింది. అధికార పార్టీకి విమర్శలు చేసేందుకు తామే ఆయుధం ఇచ్చినట్లు అయ్యింది. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు లేనిపోని చిక్కులు తెచ్చిపెడుతున్నాయని పలువురు రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.