మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో మోదీకే పట్టం

Mood of The Nation 2021. భారత ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా ఏ మాత్రం తగ్గడం లేదు.మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో మోదీకే పట్టం

By Medi Samrat  Published on  22 Jan 2021 12:15 PM GMT
Mood of The Nation 2021

భారత ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా ఏ మాత్రం తగ్గడం లేదు.. భారత దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నా ఇప్పటికీ దేశ ప్రధానిగా ఆయన్నే ఎక్కువ మంది కోరుకుంటున్నారు. కార్వీ ఇన్ సైట్స్ తో కలిసి ఇండియా టుడే చేసిన మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో ఈ విషయం తేలింది. జనవరి 3 నుంచి జనవరి 13 మధ్య దేశవ్యాప్తంగా 97 లోక్ సభ, 194 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12,232 మందిని సర్వే చేశారు. కరోనాపై పోరులో మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై 73 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. 23 శాతం అత్యంత అద్భుతంగా ఉందని కితాబునిచ్చారు. 50 శాతం మంది బాగుందన్నారు. 74 శాతం మంది నరేంద్ర మోదీని ప్రధానిగా కోరుకుంటున్నారు. గత ఏడాది ఆగస్టులో 78 శాతం మంది మోదీని ఇష్టపడ్డారు.. కానీ కొన్ని కారణాల వలన 4 శాతం తగ్గింది. 66 శాతం మంది ప్రజలు బీజేపీ హయాంలోని ఎన్డీయే ప్రభుత్వంపై సంతృప్తిగా ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే బీజేపీకే 291 సీట్లు వస్తాయని సర్వేలో తేలింది.

కరోనాతో కుదేలైన ఆర్థిక రంగాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థంగా గాడిలో పెట్టిందని 67 శాతం మంది అభిప్రాయపడ్డారు. అందులో 20 శాతం మంది ప్రభుత్వ పనితీరు అద్భుతంగా ఉందన్నారు. మహమ్మారి వల్ల ఆదాయం కోల్పోయామని 66 శాతం మంది చెబితే.. ఉద్యోగాలు కోల్పోయామని 19 శాతం మంది అభిప్రాయపడ్డారు.

మోదీ కేబినెట్ లో అమిత్ షాకి భారీ ఫాలోయింగ్ ఉందని మరోసారి తేలింది. ఉత్తమంగా రాణిస్తున్న మంత్రుల్లో అమిత్ షాకే 39 శాతం మంది ఓట్లేశారు. ఆ తర్వాత రాజ్ నాథ్ సింగ్ కు 14 శాతం మంది, రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి 10 శాతం మంది మద్దతుగా నిలిచారు. రామ మందిర నిర్మాణ తీర్పే కేంద్ర ప్రభుత్వపు అతిపెద్ద విజయమని 27 శాతం మంది పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు మంచి నిర్ణయమని 20%, కరోనా కట్టడిలో చర్యలపై 15 శాతం, మేకిన్ ఇండియాకు 9%, నల్ల ధనం వెలికితీతకు 8 శాతం మంది ఓట్లేశారు.




Next Story