ఢిల్లీ లిక్కర్ స్కామ్ వెలుగుచూసిన నాటి నుంచి భారతీయ జనతా పార్టీ(బీజేపీ), భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈడీ దాఖలు చేసిన కొత్త చార్జ్ షీటులో ఎమ్మెల్సీ కవిత పేరు ఉండడంతో తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఈ క్రమంలో బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య ట్వీట్ల వార్ మొదలైంది. కవితను ఉద్దేశిస్తూ లిక్కర్ క్వీన్ పేరు చార్జిషీట్‌లో 28 సార్లు ఉందని బీజేపీ నేత రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు. దీనిపై ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు.
"రాజగోపాల్ అన్న తొందర పడకు. మాట జారకు. 28 సార్లు నా పేరు చెప్పించినా, 28 వేల సార్లు నా పేరు చెప్పించినా అబద్ధం నిజం కాదంటూ" కవిత ట్వీట్ చేశారు.
ఢిల్లీ మద్యం కేసులో అరెస్టైన సమీర్ మహేంద్రు కేసులో ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌లో ఎమ్మెల్సీ కవిత తో పాటు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ్‌రెడ్డి, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి పేర్లను ఈడీ చేర్చింది. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన సమీర్ మహేంద్రు, శరత్ చంద్రారెడ్డి, విజయ్ నాయర్, బోయినపల్లి అభిషేక్‌ల నుంచి తీసుకున్న వాంగూల్మం ఆధారంగా ఈ చార్జిషీట్‌ను ఈడీ రూపొందించింది.