నేడు తెలంగాణకు అమిత్ షా.. ప్రశ్నల వర్షం కురిపించిన ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్‌

MLC Kavitha questions Amit Shah over his tour to Telangana.కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు(శ‌నివారం) తెలంగాణ రాష్ట్రంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 May 2022 6:04 AM GMT
నేడు తెలంగాణకు అమిత్ షా.. ప్రశ్నల వర్షం కురిపించిన ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్‌

కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు(శ‌నివారం) తెలంగాణ రాష్ట్రంలో ప‌ర్య‌టించ‌నున్నారు. తుక్కుగూడ‌లో ఏర్పాటు చేసిన బ‌హిరంగ‌స‌భ‌లో అమిత్ షా పాల్గొని ప్ర‌సంగించ‌నున్నారు. తెలంగాణ‌కు అమిత్ షా రానున్న నేప‌థ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత, మంత్రి కేటీఆర్‌ లు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆయ‌న‌పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.

ఎమ్మెల్సీ క‌విత.. అమిత్ షా జీ.. తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన రూ.3 వేల కోట్లకు పైగా ఉన్న ఫైనాన్స్ కమీషన్ గ్రాంట్ల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారని అనిప్ర‌శ్నించారు.

- వెనుకబడి ప్రాంతాల అభివృద్ధి గ్రాంటు రూ.1350 కోట్లు, జీఎస్టీ పరిహారం రూ.2247 కోట్ల జీఎస్టీ పరిహారం సంగతేంటీ..?

- ఆకాశాన్ని తాకుతున్న ద్ర‌వ్యోల్బ‌నానికి మీ స‌మాధానం ఏంటీ..?

- కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి పెరిగిన నిరుద్యోగం, మ‌త‌ప‌ర‌మైన అల్ల‌ర్ల‌పై ఏం చెబుతారు..?

- గత ఎనిమిదేండ్లలో తెలంగాణకు ఒక్క ఐఐటీ, ఐఐఎం, ఐఐఎస్‌ఈఆర్‌, ట్రిపుల్‌ ఐటీ, ఎన్‌ఐడీ, మెడికల్ కాలేజీలు, నవోదయ పాఠశాలలు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు విఫలమైందో తెలంగాణ బిడ్డలకు వివరించాలి

- మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు రూ.24 వేల కోట్లు ఇవ్వాలన్న నీతి ఆయోగ్ సిఫార్సును కేంద్ర ప్రభుత్వం ఎందుకు విస్మరించిందో చెప్పాలి..?

- కర్ణాటకలోని ఎగువ భద్ర నీటిపారుదల ప్రాజెక్టుకు, కెన్ బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా నిరాకరించడం కేంద్రప్రభుత్వం కపటత్వం కాదా? అని క‌విత ట్విట‌ర్ వేదిక‌గా అమిత్ షాపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.


కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మించాలని టీఆర్ఎస్ కోరితే బీజేపీ పట్టించుకోలేదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ''గుజరాత్‌లో మాత్రం రూ.20 కోట్లతో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం నిజం కాదా? రాష్ట్రానికి చట్టబద్ధంగా ఇచ్చిన హామీలను బీజేపీ నెరవేర్చలేదు. గుజరాత్‌కు మాత్రం ఇవ్వని హామీలను సైతం అమలు చేశారు. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో తెలంగాణ ఒక్కటంటే ఒక్క కేంద్రీయ విద్యాసంస్థనైనా ఏర్పాటు చేసిందా? ఎన్డీయే ప్రభుత్వం తెలంగాణకు కనీసం ఒక్క మెడికల్ కాలేజీని కూడా కేటాయించలేదు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం హామీ ఇచ్చిన బయ్యారం స్టీల్ ప్లాంట్‌ను తెలంగాణకు ఎందుకు కేటాయించలేదు? ఐటీఐఆర్ ప్రాజెక్టును అటకెక్కించడం, తెలంగాణకు కొత్త సాఫ్ట్‌వేర్ ప్రాజెక్టులను కేటాయించకపోవడం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకపోవడం, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆదేశాలకు అనుగుణంగా నీటి కేటాయింపులు జరపకపోవడం ఏంటి?'' అని కేటీఆర్ ప్రశ్నించారు.


Next Story