ప్రధాని మోదీని పెద్దన్న అన్నసీఎం రేవంత్‌ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత ఫైర్

ప్రధాని మోదీని పెద్దన్నగా సంబోదించిన సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కౌంటర్ ఇచ్చారు.

By Srikanth Gundamalla  Published on  4 March 2024 3:36 PM IST
mlc kavitha,  cm revanth reddy, prime minister modi ,

ప్రధాని మోదీని పెద్దన్న అన్న రేవంత్‌ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత ఫైర్

తెలంగాణలో సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్‌ నుంచి పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో ప్రధాని మోదీతో పాటుగా సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రారంభోత్సవాల సందర్భంగా ఆదిలాబాద్‌లో భారీ సభను ఏర్పాటు చేశారు. సభలో మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రధాని మోదీని పెద్దన్నగా సంబోధించారు. కేంద్రంతో ఘర్షణ పరిస్థితులు సరికాదనీ.. రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. కాగా.. ప్రధాని మోదీని పెద్దన్నగా సంబోదించిన సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు. అలాంటి కేంద్రంలో ప్రధాని గా ఉన్న మోదీ పెద్దన్న ఎలా అవుతారో చెప్పాలని రేవంత్‌ను ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం అన్నప్పుడు తెలంగాణ అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలి కానీ.. ఎందుకు బడ్జెట్‌లో కేటాయింపులు ఇవ్వలేదని అన్నారు. దీనిపై కేంద్రాన్ని ప్రశ్నించకపోగా పెద్దన్నగా ఎలా సంబోధిస్తారంటూ మండిపడ్డారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్, బీజేపీలు రెండూ ఒక్కటే అని అర్థం అవుతోందని అన్నారు. ఈ రెండు పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందనీ.. నిజాలు గ్రహించాలంటూ కవిత చెప్పుకొచ్చారు.

ఇక తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వ వ్యవహారంపైనా ఆమె ఫైర్ అయ్యారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు అన్యాయం జరుగుతోందని చెప్పారు. ప్రభుత్వం కొత్తగా జీవో నెంబర్-3ని తీసుకొచ్చిందనీ.. దీన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 33 శాతం రావాల్సిన రిజర్వేషన్ పూర్తిగా వెనక్కి పోయిందని అన్నారు. రోస్టర్ విధానంతో ఎక్కువ మంది మహిళలకు ఉద్యోగాలు రాకుడా పోయే ప్రమాదం ఉందని చెప్పారు. ఈ జీవోకు నిరసనగా మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా ధర్నాచౌక్‌లో నల్ల రిబ్బన్లతో ధర్నా చేస్తామన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.

Next Story