ప్రజలు సిద్ధంగా ఉంటే మునుగోడు ఉప ఎన్నిక : రాజగోపాల్ రెడ్డి
MLA Rajagopal Reddy Speaking on Munugode bypoll.మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్
By తోట వంశీ కుమార్ Published on 30 July 2022 1:36 PM ISTమునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ పార్టీని వీడనున్నారనే వార్త ప్రస్తుతం తెలంగాణలోని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. రాజగోపాల్ రెడ్డి పార్టీ మారకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ కి చెందిన పలువురు సీనియర్ నాయకులు బుజ్జగించినా ప్రయత్నాలు ఫలించనట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన కాంగ్రెస్ అధిష్టానం ఆ బాధ్యతను ఎంపీ ఉత్తమ్‌కుమార్, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ లకు అప్పగించింది.
దీంతో వారిద్దరూ వేర్వేరుగా శనివారం జూబ్లీహిల్స్‌లోని రాజగోపాల్ రెడ్డి నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. ఆయన్ను పార్టీ మారకుండా ఉండాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే..రాజగోపాల్ రెడ్డి ఎవ్వరి మాటా వినడం లేదు, తన పట్టు వీడలేదు. వారితో భేటీ అనంతరం రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇది పార్టీల మధ్య జరిగే యుద్ధం కాదని, కేసీఆర్‌కు మునుగోడు ప్రజలకు మధ్య జరిగే యుద్ధమని అన్నారు. కేసీఆర్ భావిస్తే ఉప ఎన్నిక రాదని, ప్రజలు సిద్ధంగా ఉంటే మునుగోడు ఉప ఎన్నిక వస్తుందన్నారు. అభివృద్ధి కేవలం సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌కే పరిమితమైందన్నారు. కేసీఆర్‌కు బుద్ధి చెప్పే ఎన్నిక వస్తుందన్నారు. మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పు తెలంగాణలో మార్పుకు నాంది కావాలన్నారు. మరో 10 నుంచి 15 రోజుల్లో యుద్ధం ప్రకటిస్తానని చెప్పారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
ఇదిలా ఉంటే.. ఆదివారం నుంచి రాజగోపాల్ రెడ్డి తన నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నిజయోకవర్గంలో పర్యటించిన తర్వాతే ఎమ్మెల్యే పదవికి రాజీనామాపై ఆయన ఒక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.