మైనంపల్లికి వ్యతిరేకంగా BRS నేతల నిరసనలు, వేటు తప్పదా?
బీఆర్ఎస్‌లో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సంచలనంగా మారారు.
By Srikanth Gundamalla Published on 22 Aug 2023 11:28 AM GMTమైనంపల్లికి వ్యతిరేకంగా BRS నేతల నిరసనలు, వేటు తప్పదా?
బీఆర్ఎస్‌లో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సంచలనంగా మారారు. ఆయనకు బీఆర్ఎస్ అధినాయకత్వం టికెట్ ఇచ్చినా.. తన కొడుక్కి కూడా ఎమ్మెల్యే టికెట్ కావాలని పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో మంత్రి హరీశ్‌రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మైనంపల్లి తీరుని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, కవిత సహా అందరూ తప్పుబడుతున్నారు. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ పలుచోట్ల బీఆర్ఎస్ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. మైనంపల్లి దిష్టి బొమ్మను దహనం చేస్తున్నారు. మైనంపల్లి తన కుమారుడికి టికెట్ ఇవ్వాలంటూ.. బీఆర్ఎస్‌లో మూలస్తంభమైన హరీశ్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో సొంత పార్టీ నేతలు విమర్శలు కురిపిస్తున్నారు. కొందరు నాయకులు అయితే.. మైనంపల్లిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతున్నారు. ఈ క్రమంలో మైనంపల్లి వ్యవహారాన్ని అధిష్టానం సీరియస్‌గా తీసుకుందని తెలుస్తోంది. ఇక సొంత పార్టీ నేతల డిమాండ్‌ను కూడా పరిశీలిస్తోందని సమాచారం అందుతోంది.
మైనంపల్లి హన్మంతరావు మల్కాజ్‌గిరి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే.. తనతో పాటు తన కుమారు రోహిత్‌కు కూడా బీఆర్ఎస్ మెదక్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తుందని భావించాడు. రోహిత్ కోవిడ్ సమయంలో మెదక్ నియోజకవర్గంలో అనేక సేవలు అందించాడని.. ప్రజా సేవలో ఉన్నందుకు టికెట్ ఇస్తారని భావించాడు. కానీ.. బీఆర్ఎస్ అధినాయకత్వం అలా చేయలేదు. మైనంపల్లికి ఒక్కరికే టికెట్ కేటాయించింది. దాంతో.. మైనంపల్లి అసంతృప్తి వ్యక్తం చేశాడు. మంత్రి హరీశ్‌రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మెదక్‌లో హరీశ్‌రావు పెత్తనం ఏంటంటూ ప్రశ్నించారు. హరీశ్‌రావుని బట్టలు ఊడదీస్తానని.. సిద్దిపేటలోనూ హరీశ్‌రావు అడ్రస్ గల్లంతు చేస్తానని అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా ఎంతో మందిని హరీశ్‌రావు అణిచివేశారని ఆరోపణలు చేశారు. అక్రమంగా లక్షల రూపాయలు కొల్లగొట్టారంటూ మండిపడ్డారు మైనంపల్లి హన్మంతరావు.
ఇక రెండోసారి స్పందించిన మైనంపల్లి మళ్లీ అవే వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలు ఆయన్ని విమర్శిస్తుండటంతో.. పార్టీని విమర్శించలేదంటూ వివరించారు మైనంపల్లి. తాను హరీశ్‌రావుపై చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమని చెప్పారు. మెదక్‌లో రోహిత్ పోటీ చేయడం ఖాయమని... తాను కూడా మల్కాజిగిరి నుంచి బరిలోకి దిగుతానని అన్నారు. తన కుమారుడి పోటీ విషయంలో మాటకు కట్టుబడి ఉంటానని అన్నారు. కాగా.. మైనంపల్లి పార్టీ మారుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. తన కుమారిడికి టికెట్ ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే.. క్యాడర్‌తో మాట్లాడిన తర్వాత తన తర్వాతి కార్యాచరణ ప్రకటిస్తానని మైనంపల్లి హన్మంతరావు చెప్పారు.
మంత్రి హరీశ్ రావుపై చేసిన వ్యాఖ్యలు తనవ్యక్తిగతమని మైనంపల్లి హన్మంతరావు తెలిపారు.తాను పార్టీని విమర్శించ లేదని, క్యాడర్ తో మాట్లాడి తన తదుపరి కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పారు. క్యాడర్ కోసం ఏ నిర్ణయమైనా తీసుకుంటాననిస్పష్టం చేశారు. pic.twitter.com/veFcMMFq08
— Newsmeter Telugu (@NewsmeterTelugu) August 22, 2023
కాగా.. హరీశ్‌రావు పట్ల మైనంపల్లి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలంతా ఖండిస్తున్న విషయం తెలిసిందే.అంతేకాక.. పదేపదే తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని పట్టుబడుతుండటంతో అధిష్టానం కూడా బీఆర్ఎస్ నేతల డిమాండ్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ వైపు మైనంపల్లి చూస్తున్నారనే వార్తలు ప్రచారంలోకి వస్తుండటంతో వేటుపడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.