నేను పీసీసీ చీఫ్ రేసులో ఉన్నా: జగ్గారెడ్డి
MLA Jagga Reddy Press Meet .. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి రేసులో ఉన్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు.
By సుభాష్ Published on 7 Dec 2020 6:17 PM ISTతెలంగాణ పీసీసీ అధ్యక్షుడి రేసులో ఉన్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. కొత్త అధ్యక్షుడి కోసం అధిష్టానం ప్రయత్నాలు కొనసాగిస్తోందిన అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే శక్తి తన దగ్గర ఉందని చెప్పుకొచ్చారు. పీసీసీ అధ్యక్షుడికి డబ్బులు ఉండాలనేది తప్పుడు అభిప్రాయమని కొట్టిపారేశారు. కాంగ్రెస్ నేతల్లో భిన్నాభిప్రాయాలున్నా ఐక్యత మాత్రం దెబ్బతినదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే మెడిసిన్ నా దగ్గర ఉంది, నాకు పీసీసీ పగ్గాలు అప్పగిస్తే తప్పకుండా న్యాయం చేస్తా అని జగ్గారెడ్డి అన్నారు. తాను దాదాపు సంవత్సరంన్నర నుంచి పీసీసీ రేసులో ఉన్నానని, ఈ విషయాన్ని కూడా ఢిల్లీ పార్టీ పెద్దలకు తెలియజేశానని అన్నారు. అధిష్టానం నాపై నమ్మకముంచి నాకు పీసీసీ అధ్యక్షుడిగా కట్టబేడితే తప్పకుండా న్యాయం చేసి మంచి ఫలితాలు తీసుకురాగల్గుతాననే నమ్మకం నాకు ఉంది అని అన్నారు.
కేంద్రం కార్పొరేట్‌కు కొమ్ముకాస్తోందని జగ్గారెడ్డి ఆరోపించారు. రైతులను నాశనం చేసే వ్యవసాయ చట్టాలను కేంద్రం తెచ్చిందన్నారు. అంబానీ, ఆదానీ, అమెజాన్‌కు లాభం చేయడానికే కొత్త చట్టం తెచ్చారని ఆరోపించారు. ఈ చట్టం వల్ల రైతులు లేకుండా పోతారని ఆయన అభిప్రాయపడ్డారు. రైతు సంఘాల భారత్ బంద్‌కు కాంగ్రెస్ పూర్తిగా మద్దతు తెలుపుతుందని అన్నారు. బాంబే రహదారిని దిగ్బంధం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తాను సంగారెడ్డిలో హైవేపై కూర్చుంటున్నట్లు తెలిపారు. రాజకీయాలకతీతంగా ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తున్నారన్నారు. అసెంబ్లీని సమావేశపర్చి వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలపై పోరాడుతానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.