జనసేనలో చేరిన తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

By Srikanth Gundamalla  Published on  7 March 2024 11:26 AM GMT
mla arani srinivasulu,  janasena, andhra pradesh, pawan,

జనసేనలో చేరిన తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పలువురు నాయకులు తమ పార్టీ అధినాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ ఇతర పార్టీల్లో చేరుతున్నారు. ఇంకొందరు టికెట్‌లు లభించకపోవడంతో షాక్‌లు ఇస్తున్నారు. తాజాగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేనలో చేరారు. పార్టీ కండువా కప్పి జనసేనలోకి సాదరంగా ఆహ్వానం పలికారు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఈ కార్యక్రమం మంగళగిరి జనసేన కార్యక్రమంలో జరిగింది. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుతో పాటు పలువురు వైసీపీ నాయకులు కూడా జనసేనలో చేరారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు.. ఏపీకి దశ దిశ చూపించే సత్తా ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు. ఇటీవలే తాను పవన్‌ కళ్యాణ్‌ను కలిసిన విషయాన్ని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్‌తో మాట్లాడినప్పుడు ప్రజల కోసం పరితపించే నేత అని తెలిసిపోయిందన్నారు. పవన్‌ కళ్యాణ్‌ చెప్పిన ఒక్కో మాట.. ఒక్కో తూటాలా కనిపించిందని ఆరణి శ్రీనివాసులు చెప్పారు. పవన్ కళ్యాణ్‌ మాటలు తన హృదయాన్ని తాకాయనీ అన్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాయలసీమ అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే శ్రీనివాసులు చెప్పారు. తాను ఎన్నో ఒడిదుడుకులను చూశాననీ.. పవన్‌ తో పాటు పార్టీ నాయకుల పోరాటం గొప్పదంటూ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కొనియాడారు.

వైసీఈలో తాను ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొన్నాననీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. జనసేన కార్యకర్తలకు ఏం జరిగినా ఇక తాను అండగా ఉంటానన్నారు. ప్రజల సమస్యపై వైసీపీ ప్రభుత్వాన్ని ఏదైనా అడిగితే స్పందించేవారు కాదంటూ విమర్శించారు. ప్రజలకు సేవ చేయని పార్టీలో ఉండటం అనవసరం అని భావించే వైసీపీ పార్టీని వీడినట్లు చెప్పారు. ఇక నుంచి పవన్‌ కళ్యాణ్‌తోనే తన ప్రయాణం కొనసాగుతుందని ఆరణి శ్రీనివాసులు చెప్పారు.

ఇక పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ప్రజలకు మంచి చేయాలనుకునే నాయకులకు జనసేన పార్టీ ఎప్పుడూ తోడుగా ఉంటుందని చెప్పారు. ఆరణి శ్రీనివాసులు జనసేనలో చేరడం సంతోషంగా ఉందన్నారు. ఆరణి శ్రీనివాసులు జనసేనకు రావడం అంటే.. తన సొంతింటికి రావడమే అన్నట్లు చెప్పారు పవన్ కళ్యాణ్‌.


Next Story