పార్టీ ఎందుకు పెట్టాడో చెప్పలేని పరిస్థితి పవన్ కళ్యాణ్‌ది: మంత్రి రోజా
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు.
By News Meter Telugu Published on 19 July 2023 6:15 PM IST
పార్టీ ఎందుకు పెట్టాడో చెప్పలేని పరిస్థితి పవన్ కళ్యాణ్‌ది: మంత్రి రోజా
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు. ఈ రాష్ట్రం కోసం ఎన్డీఏ మీటింగ్ లో ఏం అడగబోతున్నారని జర్నలిస్ట్ అడిగితే నాకు పెద్దగా అనుభవం లేదు.. నాదెండ్ల మనోహర్ చెబుతారని పవన్ అనడం దారుణమని అన్నారు. ఇక పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టింది ఎందుకు? గాడిదలు కాయడానికా? అని మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. ఒక మాట మీద నిలబడవు, పార్టీ ఎందుకు పెట్టావో చెప్పలేవు.. ఢిల్లీలో ఒక మాట, గల్లీలో ఒక మాట.. ప్రెస్ ముందు మరో మాట మాట్లాడతావని విమర్శించారు రోజా. ఇలాంటి వాళ్లకు ఎవరైనా ఓటు వేస్తారా? అందుకే గత ఎన్నికల్లో రెండు చోట్లా ఓడించారు. పవన్ సినిమాలో హీరో కావచ్చేమో. రాజకీయాల్లో మాత్రం జీరోనే అని అన్నారు మంత్రి రోజా. జగనన్నని అనే అర్హత నీకు.. నీ పార్టీ వాళ్లకి లేదు. రాజకీయ, సినిమా భిక్ష పెట్టిన అన్న అంటే కూడా పవన్ కళ్యాణ్ కు గౌరవం లేదన్నారు రోజా. ఫ్యాన్స్ అంటే గౌరవం లేదు.. కులం అంటే గౌరవం లేదు. చివరికి తల్లి అంటే కూడా పవన్ కళ్యాణ్ కు గౌరవం లేదని రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్డీయే సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం తర్వాత జనసేన, టీడీపీ, బీజేపీలు కలిసి పోటీ చేసే అవకాశం ఉందని ప్రకటించారు. ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి మురళీధరన్ తోనూ భేటీ అయ్యారు. నాదెండ్ల మనోహర్ తో కలిసి మురళీధరన్ నివాసానికి వెళ్లారు. 15 నిమిషాల పాటు ఇరువురూ రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు.