తిట్లపురాణం తప్ప మరేమిలేదు
Minister RK Roja slams Chandrababu over Mahanadu 2022 comments.మహానాడులో తిట్లపురాణం తప్ప మరేమిలేదన్నారు ఏపీ టూరిజం
By తోట వంశీ కుమార్
మహానాడులో తిట్లపురాణం తప్ప మరేమిలేదన్నారు ఏపీ టూరిజం, క్రీడల శాఖ మంత్రి రోజా. శనివారం ఆమె నియోజకవర్గ నేతలతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ పేరు వింటేనే చంద్రబాబుకు నచ్చదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, టీడీపీ పార్టీకి పట్టిన శని చంద్రబాబు నాయుడు అని స్వర్గీయ ఎన్టీఆర్ అన్నారని ఆమె తెలిపారు. ఎన్టీఆర్ ప్రాణాలు తీసి, నేడు వారి ఫోటోకి దండలు, దండం పెడుతూ.. బాబు భలేగా నటిస్తున్నారని విమర్శించారు.
ఓ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే.. కనీస కృతజ్ఞత కూడా చెప్పలేదని, అదీ ఎన్టీఆర్ పై చంద్రబాబుకు ఉన్న ప్రేమ అంటూ ఘాటుగా విమర్శించారు. బాలకృష్ణను చూస్తే జాలేస్తుందన్నారు. చంద్రబాబు రాసే స్క్రిప్ట్ చదవడం మానేసి బాలకృష్ణ.. ఎన్టీఆర్ వారసుడిగా బయటకు రావాలన్నారు. జూనియర్ ఎన్టీఆర్‌కి భయపడ్డారని, అందుకే ఆయన్ను పార్టీ నుంచి దూరం పెట్టారని విమర్శించారు. చేసిన తప్పులను సరిదిద్దుకోకుండా మహానాడులో సీఎం జగన్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, జగన్ లాంటి మంచి సీఎంను ఎన్నడూ చూడలేదని ప్రజలు చెబుతున్నారని అన్నారు. సీఎం జగన్ కు వస్తున్న ప్రజాదరణ చూసి టీడీపీ నేతలు అవాకులు చెవాకులు పేలుతున్నారని మంత్రి రోజా విమర్శలు గుప్పించారు.
ఇక మంత్రి విశ్వరూప్ ఇంటిపై జరిగిన దాడిని అమానుష చర్యగా అభివర్ణించారు. అల్లర్లను అణచివేయడానికి పోలీసులు ఎంతో సమన్వయంగా వ్యవహరించారని మెచ్చుకున్నారు. అల్లర్లకు పాల్పడిన వాళ్లు ఎంతటి వాళ్లు అయినా వదిలే ప్రసక్తే లేదని మంత్రి రోజా స్పష్టం చేశారు.