మేడిగడ్డపై బీజేపీ, కాంగ్రెస్‌లవి ఎన్నికల స్టంట్స్: మంత్రి మల్లారెడ్డి

మేడిగడ్డ బ్యారేజ్‌పై కాంగ్రెస్‌, బీజేపీలవి ఎన్నికల స్టంట్స్‌ అని చెప్పారు మంత్రి మల్లారెడ్డి.

By Srikanth Gundamalla  Published on  4 Nov 2023 8:00 AM GMT
minister malla reddy, meet the press, brs, telangana,

 మేడిగడ్డపై బీజేపీ, కాంగ్రెస్‌లవి ఎన్నికల స్టంట్స్: మంత్రి మల్లారెడ్డి

కాంగ్రెస్‌ అంటే స్కామ్.. కేసీఆర్ అంటే నీళ్లు అన్నారు మంత్రి మల్లారెడ్డి. కులవృత్తులను ఆదుకున్న ఏకైక సీఎం కేసీఆర్ అని చెప్పారు మంత్రి మల్లారెడ్డి. మీట్‌ దిప్రెస్‌ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి ఈ కామెంట్స్ చేశారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలోనే నెంబర్‌ 1 స్థానంలో ఉందని చెప్పారు. 55 ఏళ్ల పాలనలో కాంగ్రెస్‌ దేశానికి ఏం చేసిందని ప్రశ్నించారు..? ముస్లిం, మైనారిటీలను కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా మాత్రామే వాడుకుందని ఆరోపించారు. తెలంగాణలో అన్ని పండుగలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని చెప్పారు. దేశంలో ఎక్కడా ఈ పద్దతి లేదన్నారు. దేశ నాయకులు మాయమాటలు చెప్తున్నారంటూ విమర్శించారు. కాంగ్రెస్‌ పాలనలో చిన్న చిన్న కర్మాగారాలు మూతపడ్డాయనీ.. కార్మికులు రోడ్డున పడ్డారని చెప్పారు. ఇవన్నీ మన కళ్లెదుటే జరిగిందని అన్నారు మంత్రి మల్లారెడ్డి.

రేవంత్‌రెడ్డి ఎంపీగా గెలిచాక ఇప్పటికీ నియోజకవర్గంలో ముఖం చూపించలేదన్నారు. టీపీసీసీ కొనుకున్నాడు.. ఆ తర్వాత ఎమ్మెల్యే సీట్లపై పైరవీలు చేసుకున్నాడని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యి ప్రజలకేం చేస్తాడని ప్రశ్నించారు. అసలు రేవంత్‌రెడ్డి సీఎం ఎలా అవుతారని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి చరిత్ర రాష్ట్ర ప్రజలకు తెలుసని చెప్పారు. అయితే.. కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు రెండూరెండే అన్నారు మంత్రి మల్లారెడ్డి. కాంగ్రెస్‌కు పరిపాలన చేతకాదని విమర్శించారు. కాంగ్రెస్‌ పాలనలో అన్నీ స్కాంలే అంటూ విమర్శించారు. స్కాంలు అన్నీ ఎవరు చేశారో రేవంత్‌రెడ్డి చెప్పాలి? అన్నారు. ఎవ్వరూ ఇవ్వని విధంగా రాష్ట్రంలో పెన్షన్లు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే అని చెప్పారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు రూ.3వేలు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని మంత్రి మల్లారెడ్డి చెప్పారు. సీఎం కేసీఆర్ పేదల మనిషి అన్నారు. విశ్వాసం అంటే కేసీఆర్ అనీ.. భరోసా అంటే బీఆర్ఎస్ పార్టీ అన్నారు.

దేశంలోనే నెంబర్‌ నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది మల్లారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న మేడ్చల్‌ అని ఆయన అన్నారు. 13 మంది చైర్మన్లు, మేయర్లు ఉన్న నియోజకవర్గం తనదే అన్నారు. నియోజకవర్గంలో అన్ని చోట్ల రోడ్లు వేసుకున్నామని అన్నారు. అయితే.. ఇంకా కొన్ని పనులు చేసేవి ఉన్నాయని పేర్కొన్నారు. దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు.. తాను ప్రజలకు సేవ చేస్తానని అన్నారు. కరోనా కారణంగా అభివృద్ధికి కొంత అడ్డంకులు వచ్చినా.. ఆ తర్వాత అన్నీ చేసుకుంటూ వచ్చామన్నారు. పేద ప్రజలకు ఏ మంచి పనిచేసినా వారు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. పిల్లలకు చదువు చెప్పించేది.. యువతకు ఉద్యోగాలు ఇప్పించేది సీఎం కేసీఆర్ ఒక్కరే అన్నారు. అందుకే ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను గెలిపించుకుందామని మంత్రి మల్లారెడ్డి పిలుపునిచ్చారు.

మేడిగడ్డ బ్యారేజ్‌పై బీజేపీ, కాంగ్రెస్‌లు రాజకీయం చేస్తున్నాయని అన్నారు మంత్రి మల్లారెడ్డి. వేగంగా కేంద్రం నుంచి కమిటీ వచ్చిందని.. స్పీడ్‌గా విచారణ చేసి అంతే స్పీడ్‌గా నివేదిక ఇచ్చిందని అన్నారు. ఎన్నికల వేళ మేడిగడ్డ బ్యారేజ్‌ ఘటనను వాడుకుంటున్నారంటూ విమర్శించారు.

Next Story