రాహుల్‌ని సస్పెండ్ చేశారు..మరి బండి సంజయ్‌ని ఏం చేయాలి?: కేటీఆర్

పార్లమెంట్‌లో సీఎం కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు మంత్రి కేటీఆర్.

By Srikanth Gundamalla  Published on  11 Aug 2023 5:13 AM GMT
Minister KTR, Tweet,  Bandi Sanjay,  Telangana,

రాహుల్‌ని సస్పెండ్ చేశారు..మరి బండి సంజయ్‌ని ఏం చేయాలి?: కేటీఆర్

పార్లమెంట్‌లో సీఎం కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్. బండి సంజయ్‌ని ఏం చేయాలంటూ ట్విట్టర్‌లో ప్రశ్నించారు. అయితే.. గతంలో ప్రధాని మోదీని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ అవమానించారని.. ఆయనపై చర్యలు తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఎంపీగా అనర్హత వేటు వేశారని అన్నారు మంత్రి కేటీఆర్. అయితే.. సీఎం కేసీఆర్‌ గురించి ఎంపీ బండి సంజయ్‌ పార్లమెంట్‌లో నీచంగా మాట్లాడారని అన్నారు. పార్లమెంట్‌లో ప్రధాని ఇంటిపేరుని అవమానకారంగా పిలిచినందుకు రాహుల్‌ను ఎంపీగా సస్పెండ్‌ చేస్తే.. మరి ఇప్పుడు కేసీఆర్‌ను అత్యంత నీచమైన భాషలో కించపర్చిన బండి సంజయ్‌పై చర్యలు లేవా.? మీరు ఇప్పుడు ఏం చేయాలని స్పీకర్‌ సర్‌? అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. పలువురు బీఆర్ఎస్‌ నాయకులు బండి సంజయ్‌పై చర్యలు తీసుకోవాలంటూ రీట్వీట్‌లు చేస్తున్నారు.

అయితే.. ఎన్డీఏ ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టి అవిశ్వాస తీర్మానంపై ఆగస్టు 10న లోక్‌సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగానే బీజేపీ ఎంపీ బండి సంజయ్ మాట్లాడారు. ఈ క్రమంలో రాహుల్‌తో పాటు బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో 1400 మంది చనిపోయారని.. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోందని ఆరోపించారు బండి సంజయ్. తెలంగాణలో రైతులు నాశనం అవుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. అవినీతి యూపీఏ ఎలా ఇండియాగా మారిందో అదే అవినీతి టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిందన్నారు. కేసీఆర్ పేరును ఖాసీం చంద్రశేఖర్ రజ్వీ అని బండి సంజయ్ సంబోధించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరు చెప్పి ప్రజలను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తుందని బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాహుల్ గాంధీని చూస్తుంటే గజనీ గుర్తుకువస్తున్నారని బండి సంజయ్ చెప్పారు. ఇక బీఆర్‌ఎస్ నేత నామాకు బండి సంజయ్ సవాల్‌ విసిరారు. నిరంతర విద్యుత్‌ ఇస్తున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా అని అన్నారు. ప్రభుత్వంలోకి వచ్చాక కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తులు విపరీతంగా పెరిగాయంటూ ఆరోపణలు చేశారు బండి సంజయ్. దాంతో.. సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

Next Story