అమిత్ షాకు చుర‌క‌లంటిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్

Minister KTR Tweet on Amit Shah speech.సికింద్రాబాద్‌లోని ప‌రేడ్ గ్రౌండ్స్‌లో నిర్వ‌హించిన విమోచ‌న దినోత్స‌వంలో కేంద్ర

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Sep 2022 8:03 AM GMT
అమిత్ షాకు చుర‌క‌లంటిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్

సికింద్రాబాద్‌లోని ప‌రేడ్ గ్రౌండ్స్‌లో నిర్వ‌హించిన విమోచ‌న దినోత్స‌వంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొని చేసిన ప్ర‌సంగంపై రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి, టీఆర్ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్ ప‌రోక్షంగా స్పందించారు. ప్రజలను విభజించేందుకు వచ్చారని విమర్శించారు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో ట్వీట్ చేశారు.

"74 ఏళ్ల క్రితం ఒక కేంద్ర హోం మంత్రి తెలంగాణ ప్రజలను ఇండియన్ యూనియన్‌ లో విలీనం చేసి సమైక్యతను చాటారు. ఇవాళ‌ ఓ కేంద్ర హోం మంత్రి తెలంగాణ ప్రజలను విభజించి.. రాష్ట్ర ప్రభుత్వంపై బెదిరింపులకు పాల్పడేందుకు వచ్చారు. అందుకే చెబుతున్నాను. దేశానికి కావాల్సింది విభజన రాజకీయాలు కాదు. నిర్ణయాత్మక రాజకీయాలు కావాలి" అని మంత్రి కేటీఆర్‌ ట్వీట్ చేశారు.

ప‌రేడ్ గ్రౌండ్‌లో అమిత్ షా ఏం మాట్లాడారంటే..?

తెలంగాణ విమోచ‌న దినోత్స‌వాన్ని అధికారికంగా నిర్వ‌హించాల‌నేది ప్ర‌జ‌ల ఆకాంక్ష అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. భార‌త దేశానికి స్వాత్రంత్యం వ‌చ్చిన ఏడాది త‌రువాత హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు స్వాతంత్య్రం వ‌చ్చింద‌న్నారు. ఆనాటి హోం మంత్రి స‌ర్దార్ వ‌ల్ల‌భ్‌బాయ్ ప‌టేల్ కృషితోనే నిజాం పాల‌న నుంచి తెలంగాణ ప్రాంత ప్ర‌జ‌ల‌కు విముక్తి ల‌భించింద‌న్నారు. ఎంతో మంది స్వాతంత్య్రం కోసం బ‌లిదానాలు చేశార‌ని స‌ర్దార్ ప‌టేల్ లేక‌పోతే తెలంగాణ విమోచ‌నం మరింత ఆల‌స్య‌మ‌య్యేద‌న్నారు. స‌ర్దార్ పోలీస్ యాక్ష‌న్ ద్వారానే తెలంగాణ విమోచ‌నం అయింద‌న్నారు. నిజాం రాజ్యంలో అరాచ‌కాల‌ను ఇప్ప‌టికీ మ‌రువ‌లేము. ఇంకా కొంత మంది మ‌నుషుల్లో ర‌జాకార్ల భ‌యం ఉంది. భ‌యాన్ని వ‌దిలేసి ధైర్యంగా బ‌య‌టికి రావాల‌ని సూచించారు.

75 ఏళ్ల‌లో ఏ ప్ర‌భుత్వం కూడా విమోచ‌న దినోత్స‌వాన్ని జ‌రుప‌లేదు. కొంద‌రు ఇత‌ర పేర్ల‌తో ఉత్స‌వాలు జ‌రుపుతున్నారు. విమోచ‌న పేరుతోనే ఉత్స‌వాలు జ‌ర‌పాల‌న్నారు. ఓటు బ్యాంకు రాజ‌కీయాల కోసం కేసీఆర్ విమోచ‌న దినాన్ని అధికారికంగా జ‌ర‌ప‌లేద‌న్నారు. ఈ రోజు జాతీయ జెండాను ఎగురవేయడం సంతోషంగా ఉందని చెప్పారు.

Next Story