కర్ణాటకలో 5 గంటల కరెంటు ఇస్తున్నామని చెప్పడం సిగ్గుచేటు: కేటీఆర్
తెలంగాణలో ఎన్నికల వేళ ప్రచారం జోరు కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 29 Oct 2023 11:22 AM ISTకర్ణాటకలో 5 గంటల కరెంటు ఇస్తున్నామని చెప్పడం సిగ్గుచేటు: కేటీఆర్
తెలంగాణలో ఎన్నికల వేళ ప్రచారం జోరు కొనసాగుతోంది. ఓ వైపు అధికార పార్టీ బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వరుసగా సభల్లో పాల్గొంటున్నారు. కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు చేస్తున్నారు. ఇక కాంగ్రెస్, బీజేపీలు కూడా జాతీయ నాయకులను తీసుకొచ్చి ప్రచారం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలోనే కాంగ్రెస్ తరఫున కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ శనివారం తెలంగాణలో ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే.. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. అయితే.. తాజాగా డీకే శివకుమార్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆయన వ్యాఖ్యలకు కౌంటర్ వేశారు.
కర్ణాటక ప్రజలు ఓవైపు పుట్టెడు కష్టాలతో పడరాని పాట్లు పడుతుంటే పట్టించుకోకుండా తెలంగాణలో ఓట్ల వేటకొచ్చారా? అంటూ డీకే శివకుమార్‌కు మంత్రి కేటీఆర్ ప్రశ్నలు సంధించారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పలు ప్రశ్నలు అడిగారు. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే.. తెలంగాణలో అంధకారమే అని కర్ణాటక పరిస్థితిని చూస్తే అర్థం అవుతోందని విమర్శించారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. అలాంటిది ఇక్కడికి వచ్చి కర్ణాటకలో ఐదు గంటల కరెంటు అందిస్తున్నామని చెప్పడం సిగ్గు చేటు అన్నారు మంత్రి కేటీఆర్. అది మీ చేతగాని తనానికి నిదర్శనం అంటూ మంత్రి కేటీఆర్ విమర్శించారు.
కాంగ్రెస్ వైఫల్యాలను చూడ్డానికి కర్ణాటక వరకు వెళ్లాల్సిన అవసరం లేదనీ.. మీ చేతిలో దగా పడ్డ అక్కడి రైతులే ఇక్కడకు వచ్చి మీరు చేసిన అన్యాయాన్ని వివరిస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ రైతులకు కాంగ్రెస్ నుంచి పొంచి ఉన్న ప్రమాదంపై హెచ్చరిస్తున్నారని చెప్పారు. కర్ణాటక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన మిమ్మల్ని అక్కడి ప్రజలు క్షమించరు.. అలాగే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని విశ్వసించరు అంటూ కౌంటర్ ఇచ్చారు. మహిళలకు ఉచిత ప్రయాణం అని మభ్యపెట్టి మొత్తానికే కర్ణాటక ఆర్టీసిని దివాళా తీసిన విధానం ప్రజలకే కాదు.. అక్కడి ఉద్యోగులకు కూడా పెను ప్రమాదంగా మారిందన్నారు కేటీఆర్. మహిళల ఖాతాల్లో డబ్బులు జమచేస్తామన్న మీ గృహలక్ష్మి హామీకి కూడా గ్రహణం పట్టిందన్నారు. ప్రతీ ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానన్న ప్రధాని హామీలాగే మీ హామీ కూడా గంగలో కలిసిపోయిందంటూ కాంగ్రెస్‌పై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
డీకే గారు... కాంగ్రెస్ కు అధికారం ఇస్తే.. అంధకారమే అని కర్ణాటక దుస్థితిని చూసి తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయింది. దేశంలోనే ఎక్కడ లేని విధంగా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న తెలంగాణకు వచ్చి... కర్ణాటకలో 5 గంటలు కరెంట్ ఇస్తున్నామని గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటు. అది…
— KTR (@KTRBRS) October 29, 2023