వీళ్లెక్కడి ప్రతిపక్షాలు.. ఇళ్లు ఇస్తే అడ్డుకుంటారా?: మంత్రి జోగి రమేష్

మంత్రి జోగి రమేష్‌ ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు.

By Srikanth Gundamalla  Published on  24 July 2023 8:30 AM GMT
Minister Jogi Ramesh,  Chadrababu, Pawan Kalyan, Politics

వీళ్లెక్కడి ప్రతిపక్షాలు.. ఇళ్లు ఇస్తే అడ్డుకుంటారా?: మంత్రి జోగి రమేష్

ప్రతిపక్షాలు ఎక్కడైనా ప్రభుత్వం మంచి చేయాలని.. పేదలను ఆదుకోవాలని పోరాడతాయి.. కానీ ఏపీలో అలా లేదన్నారు జోగి రమేష్. పేదలకు ఉచితంగా ఇళ్లను ఇస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఆర్‌డీఏ పరిధిలో పేదల ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా వెంకటపాలెంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అక్కడ మాట్లాడిన మంత్రి జోగి రమేష్‌ ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు.

రాజకీయాల్లో చంద్రబాబు కంటే నీచమైన వ్యక్తి మరొకరు లేరన్నారు మంత్రి జోగి రమేష్. నాలుగేళ్ల వరకు సైలెంట్‌గా ఉన్న చంద్రబాబు.. ఎన్నికలకు దగ్గరకు రాగానే ఏవేవో మాట్లాడుతున్నారని అన్నారు. చంద్రబాబు ఆయన పాలనలో పేదల కోసం ఏ ఒక్క మంచి పని చేయలేదని విమర్శించారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు పాలనలో పేదలకు ఎన్ని ఇబ్బందులకు గురయ్యారో మర్చిపోలేదని అన్నారు. శవాలను కూడా సైతం పీక్కుని తినేరకం చంద్రబాబే అన్నారు. అలాంటి చంద్రబాబు మళ్లీ మీ వద్దకు వస్తున్నారు.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి జోగి రమేష్ కోరారు.

ఏపీలో చంద్రబాబు లాగే మరో వ్యక్తి ఉన్నాడని.. పవన్‌ కళ్యాణ్ అంటూ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్లు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని అన్నారు. భార్యలతో పాటు ఎన్ని పార్టీలు మారుస్తావ్‌ అంటూ పవన్‌ను నేరుగా ప్రశ్నించారు జోగి రమేష్. ఒక్కోసారి ఒక్కో మాట్లాడే వ్యక్తిని ప్రజలు నమ్మరని అన్నారు. మార్చడం, తార్చడం పవన్‌కు వెన్నతో పెట్టిన విద్య అని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో విగ్గురాజు ఒకడున్నారు.. వాడితో కలిసి పార్టీలు మార్చడం, ఎన్నికల్లో పోటీ చేయడం లాంటి కంపెనీ ఒకటి పెట్టుకోండి అంటూ పవన్‌కు సలహా ఇచ్చారు మంత్రి జోగి రమేష్. చంద్రబాబు, పవన్‌కు ప్రజలే బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా జోగి రమేష్ అన్నారు.

సీఎం జగన్ ఏపీలో అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉన్నారని చెప్పారు. అన్నం పెడుతున్నారు, అమ్మఒడి ఇస్తున్నారు. కోటి మంది అక్కాచెల్లెమ్మలకు ఆసరా ఇస్తున్నారు, అద్దె ఇంట్లో ఉంటోన్న వారికి శాశ్వత ఇల్లు ఇస్తున్నారు అని చెప్పారు. ఎంత మంది కలిసి వచ్చినా జగన్‌ను ఏం చేయలేరని.. ప్రజలంతా జగన్‌ వైపే ఉన్నారని అన్నారు. చంద్రబాబు, పవన్‌కు గత ఎన్నికల్లో ఎదురైన అనుభవమే మరోసారి కానుందని మంత్రి జోగి రమేష్ జోస్యం చెప్పారు.

.

Next Story