కేంద్రంలో రాబోయే సర్కార్‌పై మంత్రి బొత్స ఆసక్తికర కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ కేంద్రంలో రాబోయే ప్రభుత్వం గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
By Srikanth Gundamalla Published on 26 April 2024 3:18 PM ISTకేంద్రంలో రాబోయే సర్కార్‌పై మంత్రి బొత్స ఆసక్తికర కామెంట్స్
దేశంలో ఆయా చోట్ల లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. శుక్రవారం రెండో విడత పోలింగ్ జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో ఎవరు విజయం సాధించి కేంద్రంలో అధికారం చేపడతారనే దానిపై కొంత ఉత్కంఠ ఉంది. బీజేపీ మాత్రం తామే అధికారంలోకి వస్తామని దీమాగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ కేంద్రంలో రాబోయే ప్రభుత్వం గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
తమపై ఆధారపడే కేంద్రంలో ప్రభుత్వం రావాలని తాము కోరుకుంటున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తాము ఎప్పుడూ బీజేపీతో చెట్టాపట్టాలేసుకుని తిరగలేదని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే కేంద్రంలోని బీజేపీ బిల్లులకు తాము ఆమోదం తెలిపామని క్లారిటీ ఇచ్చారు. రాజకీయ ప్రయోజనాలు ఇందులో ఏమాత్రం లేవని చెప్పారు. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ తగ్గిస్తే.. బీజేపీ కొట్టుకుపోతుందని కామెంట్ చేశారు మంత్రి బొత్స. బీజేపీతో రాజకీయ పరమైన సంబంధాలు వైసీపీకి లేవనీ.. తాము ఎప్పుడూ సంఘర్షణ కూడా పడలేదని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.
ఇక మరోవైపు వైసీపీ ప్రభుత్వంపై పీయూష్ గోయల్ చేసిన కామెంట్స్‌ను మంత్రి బొత్స సత్యనారాయణ ఖండించారు. రైల్వే జోన్ కోసం 52 ఎకరాలు ఇచ్చామనీ.. ఒప్పందం జరిగిందని అన్నారు. వైసీపీ మాఫియా ప్రభుత్వం అంటూ కామెంట్స్ చేయడం సరికాదన్నారు. చేతకాని దద్దమ్మలు ఏవేవో మాట్లాడుతారని ఫైర్ అయ్యారు. ఎలక్ట్రోల్ బాండ్స్ అవినీతి గురించి దేశం మొత్తం మాట్లాడుకుంటోందనీ.. చౌకబారు విమర్శలు చేయడం మానుకోవాలని మంత్రి బొత్స హితవు పలికారు.
వైఎస్ షర్మిల విమర్శలు చేసే క్రమంలో సంయమనం పాటించాలని మంత్రి బొత్స పేర్కొన్నారు. నిన్నటి వరకు చెల్లి అనీ.. ఇప్పుడు ప్రత్యర్థి పార్టీకి నాయకురాలు అని చెప్పారు. ఇక చెల్లి, అన్న సంబంధాలు ఎక్కడుంటాయన్నారు. పెళ్లిళ్లు, పేరంటాలకు మాత్రమే ఈ బంధాలు ఉంటాయన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.