‘BRO’ నీకిదేం కర్మ అంటూ పవన్‌పై అంబటి రాంబాబు సెటైర్లు
పవన్ కళ్యాణ్ రోడ్డుపై పడుకుని నిరసన తెలపడంపై.. మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు.
By Srikanth Gundamalla Published on 10 Sept 2023 2:10 PM IST
‘BRO’ నీకిదేం కర్మ అంటూ పవన్‌పై అంబటి రాంబాబు సెటైర్లు
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుని సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన్ని సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు. అయితే.. చంద్రబాబుని కలిసి పరామర్శించేందుకు శనివారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రయత్నించారు. ఆయన్ని అడ్డుకున్న పోలీసులు.. విజయవాడ వైపు వెళ్లకుండా చూసుకున్నారు. దాంతో.. పోలీసులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ రోడ్డుపైనే నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై పడుకుని ఆందోళన తెలిపారు. అర్ధరాత్రి వేళ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మరోవైపు టీడీపీ నేతలు కూడా నిరసనలు తెలుపుతున్నారు. అక్రమంగా అరెస్ట్ చేశారంటూ పలువురు నేతలు వైసీపీ ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రోడ్డుపై పడుకుని నిరసన తెలపడంపై.. మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ ఆరోపణల్లో అరెస్ట్ అయ్యిన చంద్రబాబుకి పవన్ సంఘీభావం తెలిపేందుకు ప్రయత్నించారని.. పోలీసులు అడ్డుకోవడంతో వాహనం దిగి రోడ్డుపై పడుకున్నారని అన్నారు అంబటి. అవినీతి బాబుని అరెస్ట్ చేస్తే నీకు ఇదేమీ కర్మ ‘బ్రో’ అంటూ వ్యంగ్యంగా ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు చేశారు. మరోవైపు వైసీపీ వైసీపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో కూడా పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేశారు. రూ.371 కోట్ల స్కిల్ స్కామ్ చేసి యువత భవితను నాశనం చేసిన వ్యక్తి కోసం ఎందుకు పవన్ కళ్యాణ్ ఇంత ఆరాటం అని.. పవన్‌కూ స్కామ్‌లో ఎంత ముట్టిందో అని రాసుకొచ్చారు. అందుకే ఇంతలా ఆరాటపడుతున్నారంటూ.. ప్యాకేజీ అనుబంధం అని చెప్పకనే చెప్పారంటూ వైసీపీ అధికారక ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.
అయితే.. బ్రో సినిమాలో మంత్రి అంబటి రాంబాబుని ఉద్దేశిస్తూ ఓ క్యారెక్టర్ కనిపించింది. సంక్రాంతికి అంబటి చేసిన డ్యాన్స్‌ను ఇమిటేట్ చేస్తూ.. సినిమాలోనూ యాక్టర్ పృథ్విరాజ్‌తో డ్యాన్స్ చేయించారు. అలా ఇమిటేట్ చేయడంపై పవన్ కళ్యాణ్‌పై వరుసగా విమర్శలు చేస్తూనే ఉన్నారు అంబటి. తాజాగా మరోసారి అవకాశం దొరకగా.. బ్రోను క్యాప్షన్ చేస్తూనే చంద్రబాబుకి మద్దతు ఇవ్వడం పట్ల పవన్ కళ్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ విసిరారు.
అవినీతి బాబు ని అరెస్ట్ చేస్తే నీకు ఇదేమి కర్మ "BRO" ! @PawanKalyan pic.twitter.com/71DZvJ6q46
— Ambati Rambabu (@AmbatiRambabu) September 10, 2023