పవన్ నన్ను గోకాడు.. ఎందుకు మాట్లాడను?: అంబటి రాంబాబు

పవన్ కళ్యాణ్‌, చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి అంబటి రాంబాబు.

By Srikanth Gundamalla  Published on  3 Aug 2023 5:43 PM IST
Minister Ambati,  Pawan, Chandrababu, TDP, Janasena,

పవన్ నన్ను గోకాడు.. ఎందుకు మాట్లాడను?: అంబటి రాంబాబు

ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. కానీ.. ఇప్పటి నుంచే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వార్‌ కొనసాగుతోంది. ఈ క్రమంలో పవన్‌ కళ్యాణ్‌ నటించిన తాజా చిత్రం 'బ్రో'లో మంత్రి అంబటి రాంబాబుని టార్గెట్‌ చేస్తూ ఒక పేరడీ సీన్ ఉంది. గతంలో సంక్రాంతికి ఆయన చేసిన డ్యాన్స్‌ను పేరడీగా చేశారు. అచ్చం అతనిలానే స్టెప్పులు వేయించారు. దాంతో.. అంబటి రాంబాబు సీరియస్ అయ్యారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న అంబటి రాంబాబు.. కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఈ సినిమా నిధులపై ఫిర్యాదు చేస్తానని చెప్పారు. అయితే.. ఢిల్లీలో మొదట వైసీపీ ఎంపీలతో భేటీ అయ్యారు అంబటి. ఆ తర్వాత జల్‌ శక్తి మంత్రి షెకావత్‌తో పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడారు. ఆ తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంచలన వ్యాఖ్యలు చేశారు.

పవన్ కళ్యాణ్‌, చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి అంబటి రాంబాబు. రాయలసీమ టూర్‌లో చంద్రబాబు స్థాయికి మించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆంబోతు రాంబాబు అంటూ కించపరుస్తున్నారని చెప్పారు. ఇరిగేషన్‌ గురించి చెప్పమంటే బ్రో సినిమా గురించి మాట్లాడుతున్నారంటూ విమర్శలు చేశారు. అయితే.. చంద్రబాబు వ్యాఖ్యలపై తానూ మాట్లాడగలనని చెప్పారు మంత్రి అంబటి. చంద్రబాబు ఆంబోతులకు ఆవులను సప్లై చేశారని.. అలానే పైకి వచ్చాడని గతంలోనే ఈ విషయం చెప్పానని తెలిపారు మంత్రి అంబటి.

పోలవరం ప్రాజెక్టుని చంద్రబాబు ఎందుకు పూర్తి చేయలేకపోయారని అంబటి ప్రశ్నించారు. 2018 నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తానని చెప్పలేకపోయారని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకి డయాఫ్రం వాల్‌ వెన్నుముక లాంటిదని, కాఫర్‌ డ్యాం పూర్తి కాకుండా ఎందుకు నిర్మించారని ప్రశ్నించారు. వీటికి సమాధానం చెప్పకుండా చంద్రబాబు తనపై విపరీతమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పారు. చంద్రబాబు పాలనలో రాయలసీమలో ఒక్క ప్రాజెక్టుకైనా శంకుస్థాపన జరిగిందా? పూర్తి చేశారా? అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.

'బ్రో' సినిమాలో డైలాగులు, పాత్రలతో తమని పవన్‌ కళ్యాణ్ గోకుతున్నాడని మంత్రి అంబటి అన్నారు. అందుకే తాను ఆయన సినిమా గురించి మాట్లాడుతున్నానని తెలిపారు. గతంలో పవన్‌ నటించిన ఏ సినిమా గురించి తాను మాట్లాడలేదని చెప్పారు. పవన్ కళ్యాణ్ సినిమాకు ఎంత రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. బ్రో సినిమాకు ఎంత తీసుకున్నారో చెప్పాలన్నారు. ఈ విషయంపై బ్రో సినిమా నిర్మాత సమాధానం చెప్పాలన్నారు. ఎన్టీఆర్‌ రాముడు-భీముడు సినిమాలో లాగా పవన్‌ను అంటుంటే చంద్రబాబుకి గుచ్చుకుంటోందని విమర్శలు చేశారు మంత్రి అంబటి రాంబాబు.

Next Story