రోజుకు మూడు నియోజకవర్గాలు.. ఈనెల 22 నుంచి ప్రజల్లోకి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా రోజుకు మూడు నియోజకవర్గాల్లో పర్యటించేలా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రణాళికను రూపొందించారు.
By Srikanth Gundamalla Published on 19 March 2024 1:25 PM IST
రోజుకు మూడు నియోజకవర్గాలు.. ఈనెల 22 నుంచి ప్రజల్లోకి చంద్రబాబు
దేశంలో లోక్‌సభ ఎన్నికలతో పాటే.. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. దాంతో.. ఎన్నికల ప్రచారంలో జోరందుకుంటున్నాయి రాజకీయ పార్టీలు. ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని వైసీపీ వ్యూహాలను సిద్ధం చేసింది.. మరోవైపు తాము అధికారంలోకి వచ్చేందుకు ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీలు సీట్లను దాదాపుగా పంచుకున్నాయి. ఎంపీ అభ్యర్థులను కూడా ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ నెల 22వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారంలో మరింత దూకుడుగా పాల్గొననున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా రోజుకు మూడు నియోజకవర్గాల్లో పర్యటించేలా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రణాళికను రూపొందించారు. ప్రజాగళం పేరుతో నియోజకవర్గాల్లో వరుస సభలు నిర్వహించనున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పలువురు నేతలతో సమావేశం అయ్యారు. మూడు పార్టీల ఆధ్వర్యంలో చిలకలూరి పేటలో ఆదివారం సభ విజయవంతం కావడం టీడీపీలో మరింత ఉత్సాహాన్ని నింపిందని ఆ నాయకులు పేర్కొన్నారు. అయితే.. ఎన్నికల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం ఒక నియోజకవర్గంలో పార్టీ శ్రేణులతో చంద్రబాబు సమావేశం నిర్వహిస్తారు. బూత్ కన్వీనర్ మొదలుకొని మండల పార్టీ అధ్యక్షుడి వరకు వేల మంది పార్టీ శ్రేణులు, నాయకులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేస్తారు చంద్రబాబు.
ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలు, విధానపరమైన నిర్ణయాలతో పాటు హామీలు, ఎన్నికల్లో ఎలా పనిచేయాలనే విషయాలను చంద్రబాబు వివరిస్తారు. మధ్యాహ్నం సమయంలో ఒక నియోజకవర్గం, సాయంత్రం మరో నియోజకవర్గాల్లో రోడ్‌షోలు నిర్వహించనున్నారు. ప్రతి రోజు చివరగా పర్యటించే నియోజకవర్గంలో రాత్రి బస చేస్తారు. దాదాపు రాష్ట్రంలో 20 రోజుల పాటు 60 నియోజకవర్గాల్లో పర్యటించేలా టీడీపీ అధినేత చంద్రబాబు రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేశారు. ఇక తొలి విడత తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి రెండో దశ పర్యటనను ఖరారు చేయనున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సత్తా చాటబోతున్నాయని చంద్రబాబు దీమా వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏకు 400 స్థానాలు.. ఏపీలో టీడీపీ కూటమికి 160 స్థానాలు దక్కాలన్న లక్ష్యంతో యాత్రలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఇక ఏపీలో టీడీపీ కూటమి గెలిచే సానుకూల వాతావరణం ఉందనీ.. ప్రజలు మద్దతుగా ఉన్నారని ఆయన చెప్పారు. అందుకే గెలిచే సీట్ల సంఖ్య తగ్గడానికి అస్సలు వీలు లేకుండా కష్టపడి పనిచేయాలని పార్టీ నాయకులకు చంద్రబాబు సూచించారు.