మరోసారి అసంతృప్తిలో కోమటిరెడ్డి.. ఏఐసీసీ బుజ్జగింపులు

తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

By Srikanth Gundamalla  Published on  6 Sep 2023 11:07 AM GMT
Komatireddy venkat reddy, Congress, telangana, disappointment,

 మరోసారి అసంతృప్తిలో కోమటిరెడ్డి.. ఏఐసీసీ బుజ్జగింపులు

తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్‌లో సీనియర్‌ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజులుగా పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాలకూ అన్నింటికీ దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా జరిగిన స్క్రీనింగ్ కమిటీ కీలక భేటీకి కూడా వెంకట్‌రెడ్డి డుమ్మా కొట్టారు. అయితే.. కొన్నాళ్ల ముందు కూడా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలంగాణ కాంగ్రెస్‌ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్నాళ్లు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. దాంతో.. ఆయన స్పందించింది.. తాను కాంగ్రెస్‌లోనే ఉంటాననని చెప్పుకొచ్చారు. కానీ.. ఇప్పుడు ఆత్మగౌరవం ముఖ్యమంటూ స్వరం మార్చి మాట్లాడటంతో కాంగ్రెస్ జాతీయ నాయకత్వం కూడా రంగంలోకి దిగింది.

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎందుకు అలిగారో కారణం తెలియపోయినప్పిటికీ.. కీలక పదవులు దక్కకపోవడంపై ఆయన తీవ్ర అసహనానికి లోనైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉన్న వెంకట్‌రెడ్డి కాపాడుకునేందుకు ఏఐసీసీ రంగంలోకి దిగింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఫోన్‌ చేశారని తెలుస్తోంది. సమస్యలు అన్నింటినీ సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించినట్లు సమాచారం అందుతోంది. కేసీ వేణుగోపాల్‌ హైదరాబాద్‌కు వచ్చిన నేపథ్యంలో తనని కలవాలని కూడా సూచించినట్లు తెలుస్తోంది.

అయితే.. తెలంగాణ కాంగ్రెస్‌లో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్ట్రాంగ్‌ లీడర్ అని కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క అన్నారు. ధైర్యమున్న వ్యక్తి అని.. ఆయన అలగరు అంటూ కామెంట్స్ చేశారు. కాగా.. రేవంత్‌రెడ్డి పీసీసీ నాయకత్వాన్ని విభేదిస్తూ పార్టీ కార్యక్రమాలకు గతంలో కొంతకాలం దూరంగానే ఉన్నారు వెంకట్‌రెడ్డి. అయితే.. కర్ణాటక ఎన్నికల విజయం తర్వాత కలిసి పనిచేయాలని అధిష్టానం ఆదేశాలు జారీ చేయడంతో ఆయన శాంతించారు. కలిసి పనిచేసుకునేందుకు సిద్ధమని చెప్పారు. అయితే.. మళ్లీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అసహనానికి లోనయ్యారు. పార్టీలో చేరికలు, సీట్ల కేటాయింపు అంశంలో ఆయన అలిగినట్లు తెలుస్తోంది. ఈలోపు కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ, సీడబ్ల్యూసీ రెండింటిలో జాబితా వెలువడడం.. ఆ రెండింటిలో తనకు పదవి దక్కకపోవడంతో ఆయన తీవ్ర నిరాశకు లోనైనట్లు స్పష్టమవుతోంది. తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్నందుకు సీనియర్‌ నేతలను శాంతపర్చేందుకు అధిష్టానం అన్ని చర్యలు తీసుకుంటోంది.

Next Story