దేశంలోనే అత్యంత అవినీతిపరుడు చంద్రబాబు: కొడాలి నాని
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 4 Sept 2023 3:40 PM ISTదేశంలోనే అత్యంత అవినీతిపరుడు చంద్రబాబు: కొడాలి నాని
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యంత అవినీతిపరుడు చంద్రబాబే అని విమర్శించారు. చట్టాలు, వ్యవస్థలను అడ్డుకుపెట్టుకుని గతంలో అధికారంలో ఉన్న సమయంలో ఎక్కడా జరగనంత అవినీతికి పాల్పడ్డారని కొడాలి నాని ఆరోపించారు. ఇప్పుడేమో ఏదో అన్ని తానే అభివృద్ధి చేసినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. ఎలాంటి అవినీతి చేయకపోతే సింగపూర్‌లో చంద్రబాబుకి హోటల్స్ ఎలా వచ్చాయో చెప్పాలని నిలదీశారు కొడాలి నాని. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఎంతకైనా దిగజారేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని విమర్శించారు. అధికారం చేపట్టేందుకు 5వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తానని.. ఆ పార్టీ నేతలతో చంద్రబాబే చెప్పారని అన్నారు కొడాలి నాని. అవినీతి చేయకుంటే అంత మొత్తంలో డబ్బు చంద్రబాబు దగ్గర ఎక్కడిదని ప్రశ్నించారు.
చంద్రబాబు పార్టీలా వైసీపీ కాదని అన్నారు. ఒకవేళ 2014లోనే తాము వేల కోట్లు ఖర్చు చేసి ఉంటే అప్పుడే అధికారంలోకి వచ్చేవాళ్లమని కొడాలి నాని అన్నారు. చంద్రబాబు అత్యంత నమ్మకద్రోహి, అత్యంత స్వార్ధపరుడు, దొంగ, 420 అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిందంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. కోట్ల రూపాయలు చంద్రబాబు రెండెకరాల నుంచి అంత న్యాయంగా సంపాదించారా అని కొడాలి నాని ప్రశ్నించారు. తాను నీతి పరుడు అనుకుని ప్రత్యర్ధులపై ఆరోపణలు చేస్తున్నారంటూ చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు.
పొలిటికల్‌గానూ చంద్రబాబు అవకాశవాది అని కొడాలి నాని విమర్శించారు. ఏ ఎండకు ఆ గొడుగు పడతారంటూ ఎద్దేవా చేశారు. బీజేపీని వాడుకుంటూనే.. కాంగ్రెస్ జెండా పట్టుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబులా వైఎస్ కుటుంబం ఏమైనా రెండు ఎకరాల నుంచి వచ్చిందా? అన్నారు. వైఎస్ కుటుంబం మొదటి నుంచే సంపన్న కుటుంబం అని తెలిపారు. కానీ.. చంద్రబాబు మాత్రం అవినీతి చేసే కోట్ల ఆస్తులను సంపాదించుకున్నారని ఆరోపించారు. 2019లో చంద్రబాబుకి ప్రజలే బుద్ధి చెప్పారని అన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం మోదీ, అమిత్‌షా, బీజేపీ నాయకుల కాళ్లను చంద్రబాబు పట్టుకున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు.