కాంగ్రెస్‌లో చేరిన పీజేఆర్ కూతురు విజయారెడ్డి
Khairatabad corporator Vijaya Reddy joins Congress Party . దివంగత పీజేఆర్ కూతురు, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి
By తోట వంశీ కుమార్ Published on 23 Jun 2022 4:08 PM ISTదివంగత పీజేఆర్ కూతురు, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ల సమక్షంలో ఆమె కాంగ్రెస్ లో చేరారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విజయా రెడ్డి మాట్లాడుతూ.. తాను పార్టీ మారడం ఒక్క రోజులో తీసుకున్న నిర్ణయం కాదన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఘటనలు తనను బాధించాయన్నారు. షీ టీమ్‌లు పెట్టామని ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్నా మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఖైరతబాద్ నియోజక వర్గ ప్రజలకు ఎప్పుడూ రుణ పడి ఉంటానన్నారు. కాంగ్రెస్ మాత్రమే పేదలకు న్యాయం చేస్తుందన్నారు. సోనియా, రాహుల్ గాంధీ నాయకత్వంలో పని చేయడానికి వచ్చానన్నారు. తాను పదవుల కోసం పార్టీ మారలేదని, ఇక మూడు రంగుల జెండా వదలనని, తనదిక ఒకటే జెండా, ఒకటే బాటని విజయారెడ్డి అన్నారు.
దివంగత పీజేఆర్ పేరు తెలియని వారు ఎవరూ ఉండరని, పేదలకు పెద్దన్న పీజేఆర్ అని రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నో బస్తీలు పీజేఆర్‌తో వెలిశాయన్నారు. ప్రజల కోసం సొంత పార్టీని కూడా నిలదీయడానికి పీజేఆర్ వెనుకాడలేదని, చివరి శ్వాసవరకు పీజేఆర్ పేదల కోసం పని చేశారని కొనియాడారు. పీజేఆర్ లేని లోటు తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. పేద ప్రజల పక్షాన పోరాడే దళపతి దొరికిందని, విజయారెడ్డికి మంచి గౌరవం దక్కుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు.
I wholeheartedly welcome Khairatabad corporator, daughter of our beloved leader PJR…Smt. P.Vijaya Reddy garu into #Congress family.
— Revanth Reddy (@revanth_anumula) June 23, 2022
This growing trust on @INCTelangana will break the arrogance of ruling TRS. pic.twitter.com/Xq2yItF5kS