అసెంబ్లీ ఎన్నికల ముందు కీలక పరిణామం.. బీజేపీలోకి కిచ్చా సుదీప్
బుధవారం హీరో సుదీప్ (కిచ్చా సుదీప్), దర్శన్ తూగుదీప కషాయ కండువా కప్పుకోనున్నారు
By తోట వంశీ కుమార్ Published on 5 April 2023 9:51 AM ISTకర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు పలువురు కన్నడ సినీ ప్రముఖులు భారతీయ జనతా పార్టీ(బీజేపీ) తీర్థం పుచ్చుకోనున్నారు. హీరో సుదీప్ (కిచ్చా సుదీప్), దర్శన్ తూగుదీప కషాయ కండువా కప్పుకోనున్నారు. పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం నేడు(బుధవారం) మధ్యాహ్నం 1.30 తరువాత బెంగళూరులోని ఓ ప్రైవేటు హోటల్‌లో నిర్వహించే కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సమక్షంలో వారు పార్టీలో చేరనున్నారు. మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఇదిలా ఉంటే.. అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డు ఏప్రిల్ 8న ఖరారు చేసి విడుదల చేస్తుందని బొమ్మై మంగళవారం తెలిపారు. గెలుపోటములను బట్టి అభ్యర్థుల ఎంపిక జరిగిందని ముఖ్యమంత్రి చెప్పారు.
“వాస్తవికత మరియు గెలుపుపై ఆధారపడి అభ్యర్థుల ఎంపిక జరిగింది. రాష్ట్ర-కమిటీ సమావేశం నేటి నుండి రెండు రోజుల పాటు జరుగుతుంది. సమావేశం తరువాత, అభ్యర్థుల జాబితాను హైకమాండ్‌కు పంపబడుతుంది. అక్కడ పరిశీలన చేయబడుతుంది. ఏప్రిల్ 8న విడుదల చేయనున్నారు.’’ అని ముఖ్యమంత్రి తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని పునరుద్ఘాటిస్తూ.. గత మూడు నాలుగు రోజులుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ వస్తుందని అన్నారు.