ఆత్మగౌరవమే ముఖ్యం.. సినిమాను యూట్యూబ్‌లో ఫ్రీగా విడుదల చేసేవాడిని: పవన్
ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వేడి కొనసాగుతోంది.
By Srikanth Gundamalla
ఆత్మగౌరవమే ముఖ్యం.. సినిమాను యూట్యూబ్‌లో ఫ్రీగా విడుదల చేసేవాడిని: పవన్
ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వేడి కొనసాగుతోంది. రాజకీయ పార్టీల మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. కోనసీమ జిల్లా మలికిపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయభేరి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. జనసేన పార్టీలో తాను మొదటితరం రాజకీయ నాయకుడిని అని చెప్పారు. జగన్ లా తాతలు, తండ్రుల నుంచి వున్న కాంగ్రెస్ నుంచి వచ్చిన వాడిని కాదన్నారు పవన్ కల్యాణ్. తనకు ప్రజా సమస్యలు ప్రతి ఒక్కటి తెలుసనీ. సామాన్య ఉద్యోగి కొడుకుగా అన్ని ఇబ్బందులను చూసి వచ్చానని పవన్ కల్యాణ్ అన్నారు.
అయితే.. ప్రజల అభిమానంతో నటుడిగా ఎదిగానని చెప్పుకొచ్చారు పవన్. 2009లోనే రాజకీయాల్లోకి వచ్చినా.. దాన్ని నిలబెట్టుకోలేకపోయామన్న బాధ ఉందన్నారు. ఎవరి ఆసరా లేకపోయినా దశాబ్దకాలంగా పార్టీని నడిపానంటే ప్రజలు ఇచ్చిన బలమే అందుకు కారణమని పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పారు. ఏపీలో జగన్ పార్టీకి వ్యతిరేక గాలులు వీస్తున్నాయనీ.. వైసీపీ ప్రభుత్వం దిగిపోయే సమయం ఆసన్నమైందని అన్నారు. ఏపీలో రాబోయేది టీడీపీ-జనసేన ప్రభుత్వమే అని చెప్పుకొచ్చారు. తాము అధికారంలోకి వచ్చాక రైతాంగం కోసం ఎంత బలంగా నిలబడతామో మీరే చూస్తారంటూ పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు.
వైసీపీ కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తోందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. అంబేద్కర్ వంటి మహనీయుడి పేరు కోనసీమ జిల్లాకు పెడితే ఎవరికి అభ్యంతరం ఉందని అన్నారు. విజయవాడలో రంగా, దేవినేని నెహ్రూ గొడవ కులాల మధ్య గొడవలుగా మారాయన్నారు. తాను ఏ రోజూ డబ్బుల కోసం వెంపర్లాడలేదన్నారు. తాను వెళ్లి వారి కాళ్లు పట్టుకోవాలని అంటున్నారనీ.. జగనన్న కొంచె కనికరిస్తే పవన్ సినిమాకు డబ్బులు వస్తాయని బతిమాలుకోవాలట అని అన్నారు. అయితే.. తనకు ఆత్మగౌరవం ఉందనీ.. దానికంటే ఇంకేది ముఖ్యం కాదన్నారు. అవసరమైతే తన సినిమాను ఫ్రీగా యూట్యూబ్‌లోనే రిలీజ్ చేస్తానని చెప్పినట్లు పవన్ కల్యాణ్ చెప్పారు. మరోవైపు తన కోసం 40 మంది ఎర్రచందనం స్మగ్లర్లను దింపారని చెప్పారు. ఇలాంటి దోపిడీ దారులు, గూండాలకు పవన్ కల్యాణ్ భయపడబోడు అని ఆయన చెప్పారు.