బీఆర్ఎస్‌ను వీడిన మరో ఎమ్మెల్యే.. కేటీఆర్ కీలక కామెంట్స్

బీఆర్ఎస్‌కు ఆ పార్టీ జగిత్యాల ఎమ్మెల్యే ఎం. సంజయ్‌ కుమార్‌ షాక్ ఇచ్చారు.

By Srikanth Gundamalla  Published on  24 Jun 2024 10:22 AM IST
jagtial, mla Sanjay, goodbye ,  brs,   congress,

బీఆర్ఎస్‌ను వీడిన మరో ఎమ్మెల్యే.. కేటీఆర్ కీలక కామెంట్స్

బీఆర్ఎస్‌కు ఆ పార్టీ జగిత్యాల ఎమ్మెల్యే ఎం. సంజయ్‌ కుమార్‌ షాక్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీని వీడి ఆదివారం రాత్రి కాంగ్రెస్‌లో చేరారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పారు. రెండు రోజుల వ్యవధిలోనే బీఆర్ఎస్‌ కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడం ఆ పార్టీకి దెబ్బమీద దెబ్బలా మారింది.

2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జీవన్‌రెడ్డిపై ఎం. సంజయ్‌ కుమార్‌ మరోసారి గెలుపొందారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో కొంత నిరుత్సాహంతో ఉన్నట్లు సమాచారం. బీఆర్ఎస్ ముఖ్య నేత, ఎమ్మెల్సీ కవితకు నమ్మిన బంటుగా ఉన్న సంజయ్‌.. ఆమె అరెస్ట్‌ అయినప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉంటున్నారు. పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలతో కేసీఆర్ కనీసం సమావేశం కాకపోవడంతో అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. కొద్దిరోజులుగా ఆయన పార్టీ మార్పుపై డైలమాలో ఉన్నారు. ఎట్టకేలకు సంజయ్‌ కాంగ్రెస్‌లో చేరారు. కాగా.. ఆయన పార్టీలో చేరుతున్న విషయం ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి కూడా తెలియదని సాచారం. మరి మున్ముందు జగిత్యాల రాజకీయాల్లో ఎలాంటి మార్పులు జరుగుతాయనేది ఆసక్తిగా మారింది.

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్‌ను వీడటంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. 2004-06లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా ఎమ్మెల్యేలు పార్టీని వీడారని గుర్తు చేశారు. ఆ తర్వాత ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించారని తెలిపారు. దాంతో ప్రజా తీర్పుకు కాంగ్రెస్‌ తలవంచక తప్పలదేన్నారు. చరిత్ర పునరావృతం అవుతుందనీ.. అధికారంలో ఉన్నవారి కంటే ప్రజల అధికారమే గొప్పదని కేటీఆర్ అన్నారు.

తాజాగా సంజయ్ చేరికతో మొత్తం ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ గూటికి చేరినట్లు అయ్యింది. ఇప్పటికే బీఆర్ఎస్ కీలక నేతలు పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ కండువా కుప్పుకున్న విషయం తెలిసిందే.

Next Story