తెలంగాణ ఇన్ఛార్జ్ గా వ్యవహరించిన దీపాదాస్ మున్షీని తొలగించింది కాంగ్రెస్ అధిష్టానం. ఆమె స్థానంలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇన్ఛార్జ్ గా మీనాక్షి నటరాజన్ ను నియమించింది. తెలంగాణతో పాటు ఒడిశా, జార్ఖండ్, బీహార్, మణిపూర్, తమిళనాడు, మధ్యప్రదేశ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు కొత్త ఇన్ఛార్జ్ లను హైకమాండ్ నియమించింది. దీపాదాస్ పై తెలంగాణ కాంగ్రెస్ నేతల నుంచి హైకమాండ్ కు పలు ఫిర్యాదులు వెళ్లినట్టు సమాచారం.
ఏకపక్షంగా ఆమె నిర్ణయాలను తీసుకుంటున్నారని, నేతల మధ్య సమన్వయం నెలకొల్పడంలో కూడా విఫలమయ్యారనే విమర్శలు వచ్చాయి. దీపాదాస్ మున్షీ కేరళ, తెలంగాణ రాష్ట్రాలకు ఇన్‌ఛార్జిగా ఉన్నప్పటికీ, తెలంగాణపై తగిన శ్రద్ధ వహించడం లేదని పలువురు కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. సీనియర్ నేతలను కలవకుండా, ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయకుండా ఆమె వ్యవహరించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో పార్టీకి నష్టం జరుగుతోందని భావించి రాష్ట్రానికి ఆమె స్థానంలో కొత్త ఇన్ఛార్జ్ ని నియమించారు.
మధ్యప్రదేశ్‌కు చెందిన మీనాక్షి నటరాజన్, యూత్ లో ఉన్నప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తూ వచ్చారు. ఎన్ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ వింగ్, ఏఐసీసీలో కూడా కీలక భాద్యతలు నిర్వర్తించారు. 2009లో మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తర్వాతి రెండు ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. రాహుల్ గాంధీ అత్యంత విశ్వసనీయ నేతల్లో ఒకరిగా ఆమె గుర్తింపు పొందారు. మీనాక్షి నటరాజన్, త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఛార్జిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.