జనసేనాని వ్యూహం మారుతోందా?
Is Jana Sena's strategy changing.జనసేనాని పవన్ కల్యాణ్ తాజా వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.
By సునీల్ Published on 23 Aug 2022 6:11 AM GMT- తొలుత బీజేపీతో పోరాటమని ప్రకటన
- తర్వాత వ్యతిరేక ఓటు చీల్చకుండా పొత్తులన్నారు
- తాజాగా ఎవరైనా తమ దగ్గరకే రావాలని వ్యాఖ్య
జనసేనాని పవన్ కల్యాణ్ తాజా వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. నటుడిగా తిరుగులేని చరిష్మా సాధించిన పవన్ రాజకీయ నాయకుడిగా ఆ స్థాయి సక్సెస్ చవి చూడలేదు. పార్టీ స్థాపించి ఎనిమిదేళ్లు గడుస్తున్నా చెప్పుకోదగ్గ విజయాలేవీ నమోదు చేసుకోలేదు. 2014లో టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకుని, కేవలం మద్దతుకే పరిమితమయ్యారు. 2019లో ఒంటరి పోరాటం చేసి ఒక సీటు సాధించారు. అప్పటి నుంచి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి మంచి ఫలితాలే సాధించారు. రాబోయే ఎన్నికల గురించి జనసేనాని నోటి నుంచి ఈ మూడేళ్లలో మూడు రకాల స్టేట్ మెంట్లు రావడం చర్చలకు దారి తీస్తోంది.
ఉమ్మడి అజెండా ఏదీ?
జనసేన ఎనిమిదేళ్ల ప్రస్థానంలో వైసీపీతో మినహా అన్ని ముఖ్య పార్టీలతో పొత్తు సాగించారు. 2019 ఎన్నికల తర్వాత పాత పొత్తులకు బై చెప్పి బీజేపీతో జత కట్టింది. అయితే అప్పుడప్పుడూ బీజేపీ జాతీయ నేతలను పవన్ కలవడం, రాష్ట్ర నేతలు పవన్‌ను కలవడం కనిపించాయి. అంతే కాని ఒకే అజెండాతో వేదిక పంచుకున్న దాఖలాలు లేవు. ఉమ్మడి రోడ్ మ్యాప్ రూపొందించి, ప్రజల్లోకి వస్తామన్న మాటలు మాటలుగానే ఉండిపోయాయి.
బీజేపీతోనే ప్రయాణం
బీజేపీతో పొత్తు సందర్భంగా 2024 ఎన్నికలకు కలిసే వెళ్తామని ఇరు పార్టీల అగ్ర నేతలు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారాన్ని కైవసం చేసుకుంటామన్నారు. వైసీపీ, టీడీపీలు వారసత్వ రాజకీయాలు చేస్తున్నాయన్నారు. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసపుచ్చుతున్నాయని విమర్శించారు. బీజేపీ కేంద్ర నాయకత్వంతో సన్నిహిత సంబంధాలున్నాయంటూ పవన్ చెబుతూ వస్తున్నారు. ఏ ఎన్నికలు జరిగినా బీజేపీతో కలిసి పోటీ చేస్తామన్నారు.
ఆవిర్భావ సభ నుంచి మారిన మాటలు
జనసేన ఆవిర్భావ సభ నుంచి పవన్ మాటలు మారుతూ వస్తున్నాయి. సభా వేదికపై నుంచే వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమని స్పష్టం చేశారు. షణ్ముఖ వ్యూహం అంటూ పార్టీ ఆలోచనలను వివరిస్తూనే పొత్తులపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ వ్యతిరేక ఓటు చీలకూడదంటే కలిసి వచ్చే పార్టీలను కలుపుకొనే ఉద్దేశాన్ని వెల్లడించారు. తర్వాత పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా చిట్ చాట్‌లోనూ టీడీపీతో పొత్తుపై నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నుంచి ప్రతిపాదన వస్తే అప్పుడు చూద్దామన్నారు. తాజాగా రాయలసీమ పర్యటనలో మరోసారి మాట మారింది. ఇటీవల పార్టీ అంతర్గత సర్వేల్లో జనసేన గ్రాఫ్ పెరిగినట్లు వెల్లడైంది. రాబోయే ఎన్నికల్లో జనసేన పాత్ర కీలకమని పవన్ వ్యాఖ్యానించారు. జాతీయ స్థాయిలో ఆప్ థర్డ్ ఫ్రంట్ అవుతుందని, ఏపీలో జనసేనదే ఆ పాత్ర అన్నట్లు చెప్పుకొచ్చారు. పొత్తుల కోసం జనసేన వెళ్లదని, ఏ పార్టీ అయినా జనసేన దగ్గరకే రావాలంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉందని, ఆలోగా పొత్తులపై నిర్ణయం మారొచ్చని జనసేన కీలక నేత ఒకరు చెప్పారు. బీజేపీతో కంఫర్ట్‌గా ఉన్నారా అని అడగగా.. పొత్తుల్లో పట్టువిడుపులు రెండూ ఉంటాయని వ్యాఖ్యానించారు.