ఎన్డీఏ ప్రభుత్వంపై అవిశ్వానికి సిద్ధమవుతోన్న విపక్షాలు?
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
By Srikanth Gundamalla Published on 25 July 2023 1:34 PM ISTఎన్డీఏ ప్రభుత్వంపై అవిశ్వానికి సిద్ధమవుతోన్న విపక్షాలు?
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టాల. ఇప్పటికే మణిపూర్ వ్యవహారం పార్లమెంట్‌లో నడుస్తోంది. మణిపూర్‌లో ఉన్న పరిస్థితులపై చర్చకు విపక్ష పార్టీలన్నీ పట్టుబడుతున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే ఎన్డీఏ సర్కార్‌కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని విపక్ష ఎంపీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మంగళవారం ఉదయం ఉభయ సభలు ప్రారంభం అవ్వడానికి ముందు ఇండియా కూటమి నేతలు సమావేశం అయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేయడం వంటి అంశాలపై చర్చించారు. ఈ క్రమంలోనే మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ప్రభుత్వం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్ వేదికగా స్టేట్‌మెంట్ ఇచ్చేంత వరకు నిరసనలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దాంతో.. మణిపూర్ అంశం గురించి పార్లమెంట్ ఉభయ సభలు అట్టుడికి పోతున్నాయి. వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. అయితే .. ఇండియా కూటమి సమావేశంలో అవిశ్వాస తీర్మానంపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. అందుకు విపక్ష పార్టీల నాయకులు కూడా అంగీకరించారని పలువురు నాయకులు చర్చించుకుంటున్నారు.
విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగడం లేదు. కేంద్ర ప్రభుత్వ తీరుని ప్రజలకు తెలియజేందుకు ఇదే మంచి సమయంగా భావిస్తోన్న విపక్ష ఎంపీలు పట్టువిడవకుండా నిరసన తెలుపుతున్నారు. దాంతో.. ఉభయ సభలు కూడా వాయిదాలు పడతూనే ఉన్నాయి. నినాదాలు ఆపాలని స్పీకర్ ఓం బిర్లా కోరినా విపక్ష నాయకులు అంగీకరించడం లేదు. ఇక రాజ్యసభలోనూ ఇదే పరిస్థితులు రిపీట్ అవుతున్నాయి. సభ మొదలైన 10 నిమిషాలకే వాయిదా వేస్తున్నారు.
ఇక పీయూష్ గోయల్ స్పందిస్తూ.. మహిళలపై నేరాలు జరిగితే చర్చించాలని అన్నారు. రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లో మహిళలు, చిన్నారులపై జరిగిన ఆకృత్యాలపై చర్చకు ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. కానీ.. మణిపూర్ అంశం గురించి మాత్రం ప్రస్తావించలేదు. ఇక పోతే.. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇండియా కూటమిపై విమర్శలు చేశారు తప్ప.. మణిపూర్ అంశం గురించి మాట్లాడలేదు. దాంతో.. మణిపూర్ ఘటనపై పార్లమెంట్‌లో నిరసనలు కొనసాగేలానే కనిపిస్తున్నాయి.
ప్రతిపక్ష కూటమి I-N-D-I-A అని పేరు మార్చుకున్నంత మాత్రాన వాటి తీరు మారదని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈస్ట్ ఇండియా కంపెనీ పేరులోనూ ఇండియా ఉందని గుర్తు చేశారు. అంతేకాదు.. పీఎఫ్‌ఐ వంటి ఉగ్ర సంస్థల పేరులోనూ ఇండియా ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు దిశ, దశ లేని ఇలాంటి ప్రతిపక్షాలను చూడలేదని ఫైర్ అయ్యారు మోదీ. అధికారంలోకి వచ్చే ఆలోచన విపక్షాలకు లేనట్లుందని అన్నారు. దేశ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈ పేరు పెట్టుకున్నారని విపక్షాలపై విమర్శలు చేశారు ప్రధాని మోదీ.